మహిళా పోలీసుల కొలతలు కొలుస్తున్న మగ టైలర్లు.. జగనన్నా ఏందన్నా?
Published on: Mon Feb 7, 2022 1:34PM
లేడీస్ టైలర్ సినిమా చూసే ఉంటారుగా! అందులో హీరో రాజేంద్ర ప్రసాద్.. లేడీస్ డ్రెసెస్ కుట్టే టైలర్. మహిళల కొలతలు కొలుస్తూ.. మచ్చలు వెతుకుతూ.. చేసే అరాచకం అంతాఇంతా కాదు. అది సినిమా. ఒకప్పుడు మహిళల బట్టలు మగవాళ్లే కుట్టేవారు కాబట్టి అలా నడిచింది. ఇప్పుడు కాలం మారింది. లేడీస్ బట్టలు లేడీసే కుడుతున్నారు. చాలామంది మహిళలు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అదంతా సరే కానీ.. తాజాగా, ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న యవ్వారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది జగనన్న రాజ్యమా? ఆటవిక రాజ్యమా? అని మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

ఈ ఫోటో ఓసారి చూడండి.. అతను ఆమెను ఎక్కడ కొలుస్తున్నాడో చూడండి.. ఇక్కడున్న మహిళలంతా పోలీస్ కానిస్టేబుల్స్. వారికి ఖాకీ యూనిఫామ్స్ కుట్టాలి. ఆ పని ఎవరు చేయాలి? టైలరింగ్ చేసే లేడీస్ చేయాలి.. కానీ, ఎవరు చేస్తున్నారు? మగ టైలర్స్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది.
నెల్లూరు జిల్లాలో ఆడ పోలీసుల కొలతలు.. మగవారు తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. యూనిఫాం కుట్టడానికి.. బ్రెస్ట్ కొలతలు, హిప్ కొలతలు.. అంటూ.. ఎక్కడపడితే అక్కడ టేపులు చుట్టి పర్సనల్ సైజులన్నీ కొలుస్తున్నారు మగ దర్జీలు. మగవాళ్లు అలా కొలుస్తుండటంపై తెగ ఇబ్బందిగా ఫీలవుతున్నారు మహిళా పోలీసులు. సిగ్గుతో చచ్చిపోతున్నారు. తమ బాధను బయటకు చెప్పుకోలేక.. అలాగని వారికి సహకరించలేక.. తెగ మదనపడుతున్నారు. అసలే పోలీస్ డిపార్ట్‌మెంట్.. ప్రశ్నిస్తే ఎక్కడ పనిష్మెంట్ ఇస్తారోనని భయంతో ఆ బాధను మౌనంగా భరిస్తున్నారు.
అదేంటి.. యూనిఫాం కొలతలు తీసుకునేందుకు ఓ మహిళా టైలర్‌ను పెట్టలేరా? లేడీస్ కొలతలను మగవారు తీసుకోవడం ఏంటి? వీధివీధినా లేడీస్ టైలర్స్ ఉంటారు.. ఓ మహిళా టైలర్‌ను ఎంగేజ్ చేసుకోలేరా? డిపార్ట్‌మెంట్‌లో లేడీసే లేరా? తిరుపతిలో గుండు చేయడానికే మహిళా క్షవరకులను ఏర్పాటు చేస్తుంటే.. పోలీసు శాఖలో ఓ లేడీస్ టైలర్‌ను పెట్టలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఆటవిక కాలం మాదిరి లేడీస్ కొలతలను జెంట్స్‌తో తీయిస్తుండటం దారుణమని మండిపడుతున్నాయి మహిళాసంఘాలు. జగనన్న పాలనలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా? అని నిలదీస్తున్నారు.


