TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆహా.. ఏం చెప్తిరి ఏం చెప్తిరి.. న‌వ్విపోదురుగాక చిరంజీవికేంటి!

Published on: Thu Jan 13, 2022 3:41PM

10 రోజుల్లో గుడ్‌న్యూస్‌. చిరంజీవి తేల్చేశారు. జ‌గ‌న‌న్న మ‌న‌సులో మాట‌ను చెప్పేశారు. ఐదో షోకు ప‌ర్మిష‌న్‌, కార్మికుల స‌మ‌స్య‌లు, టికెట్ ధ‌ర‌ల పెంపు.. ఇలా అన్ని స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ట చిరంజీవి. ఈయ‌న చెప్పిన వ‌ర్ష‌న్ విని ఆయ‌న అవాక్క‌య్యార‌ట‌. సీఎం గారు ఎంతో సానుకూలంగా స్పందించార‌ట‌. జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి గారు చాలా ఆప్యాయంగా వ‌డ్డించార‌ట‌. అబ్బో.. మా గొప్ప‌గా చెప్పారు చిరంజీవి.. జ‌గ‌న్‌తో జ‌రిగిన భేటీ గురించి. 

ఎంతైనా సినిమా వాళ్లు క‌దా.. అందులోనూ మెగాస్టార్ కూడానూ.. ఆ మాత్రం గొప్ప‌గా న‌టించ‌కుండా ఎలా ఉంటారు చెప్పండి. ఇప్ప‌టికే టాలీవుడ్‌ను జ‌గ‌న్ దారుణంగా దెబ్బ‌కొట్టారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి చావ చిత‌క్కొట్టారు. ఇప్ప‌టికే వంద‌లాది థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. క‌రోనా సాకుతో పెద్ద సినిమాలు వాయిదా ప‌డ్డాయి. ఇంతా చేశాక‌.. ఇంత అరాచ‌కం సృష్టించాక‌.. సినిమా వాళ్లు బ‌లిసికొట్టుకుంటున్నార‌ని తిట్టిపోసాక‌.. ఇప్పుడు తీరిగ్గా ఇండ‌స్ట్రీ పెద్ద‌న్న చిరంజీవి గారిని.. ఇంటికి పిలిపించుకుని.. క‌డుపు నిండా పండ‌గ భోజ‌నం పెట్టి.. చెవుల నిండుగా నోరారా మాట‌లు చెప్పి.. త్వ‌ర‌లో శుభ‌వార్త చెబుతానంటూ సాగ‌నంపారు. ఇక అంతే. ఎవ‌ర్నీ పిల‌వ‌కుండా త‌న‌నొక్క‌డినే పిలిచార‌నే గొప్ప‌నో ఏమో గానీ.. ఇండ‌స్ట్రీ పెద్ద‌గా కాదు.. బిడ్డ‌గా వ‌చ్చానంటూ.. చిరంజీవి తెగ సంతోషప‌డిపోతున్నారు. 

చిరంజీవి సినిమా వారేగాని.. గ‌తంలో ఫ‌క్తు పొలిటిక‌ల్ లీడ‌ర్ కూడా. 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో పీఆర్పీతో ప‌రోక్షంగా జ‌గ‌న్ తండ్రి వైఎస్సార్‌కు ఫుల్‌గా స‌హ‌క‌రించారు. చంద్ర‌బాబును ఓడించి.. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో క‌లిసిపోయి.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వితో సొంత లాభం చూసుకున్నారు. ఆయ‌న్ను న‌మ్ముకున్న వారిని న‌ట్టేట ముంచేశారు. ఇక త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను, ఆయ‌న సినిమాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంత‌లా టార్గెట్ చేస్తున్నా.. అన్న‌య్య మాత్రం జ‌గ‌న్‌తో మిలాక‌త్ అవుతూ.. జ‌గ‌న‌న్న అంతా మంచే చేస్తాడంటూ మీడియా ముందు నీతులు చెబుతున్నారు. రాఘ‌వేంద్ర‌రావు, రాజ‌మౌళిలాంటి వారు చెబితే చెవికెక్కించుకోలేదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తిడుతూ చెప్పినా త‌ల‌కెక్క‌లేదు.. మిత్రుడు నాగార్జున ప‌ర్స‌న‌ల్‌గా వెళ్లి మంచి మాట‌లు చెప్పినా ప‌ట్టించుకోలేదు.. వ‌ర్మ వోడ్కా తాగి ట్వీట్ల‌తో కుమ్మేసినా కదలిక లేదు.. ఎంతమంది చెప్పినా వినని జగనన్న.. ఇప్పుడు చిరంజీవి చెప్ప‌గానే ఆయ‌న‌లో మార్పు వ‌చ్చేసిందా?  త్వ‌ర‌లోనే శుభ‌వార్త చెబుతారా? న‌వ్విపోదురుగాక చిరంజీవికేంటి? అన్న‌ట్టుంది మేట‌ర్‌. త‌మ్ముడుని అంత టార్చ‌ర్ చేస్తున్నా.. అన్నయ్య‌ వెళ్లి జ‌గ‌న‌న్న‌తో విందు రాజ‌కీయాలు చేయ‌డం చిరంజీవికే చెల్లిందంటూ మండిప‌డుతున్నారు జ‌న‌సైనికులు.