TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు వేడుకోలుపై విమ‌ర్శ‌లు.. మెగా బెగ్గింగ్‌పై ఆర్జీవీ సెటైర్లు..

Published on: Fri Feb 11, 2022 10:05AM

మీరు చ‌ల్ల‌ని చూపు చూడాలి.. తండ్రిలాంటి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం.. ఇలా మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ సీఎం జ‌గ‌న్‌రెడ్డిని వేడుకుంటున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. చిరంజీవి అంత‌టి వారు.. జ‌గ‌న్‌లాంటి వారిని.. ఇలా ప్రాదేయ‌ప‌డ‌టం చూసి చాలామంది చ‌లించిపోతున్నారు. కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటే.. చాలామంది మెగాస్టార్ అంత‌లా దిగ‌జారి, చేతులు జోడించడ‌మేంట‌ని విమ‌ర్శిస్తున్నారు. 

ఆ వీడియో చూట్టానికి, విన‌డానికి ద‌య‌నీయంగానే ఉంది. చిరు మాటల్లో ఆవేద‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సినిమా ప‌రిశ్ర‌మ‌కు, సినిమా పెద్ద‌ల‌కు ఇంత‌టి దారుణ ప‌రిస్థితి క‌ల్పించిన జ‌గ‌న‌న్న‌పై అంతా మండిప‌డుతున్నారు. మెగాస్టార్‌ను అంత‌లా బ‌తిమిలాడించుకోవ‌డం.. ఆయ‌న‌తో దేహీ అంటూ దండం పెట్టించుకునే.. స్థాయికి దిగ‌జార్చిన జ‌గ‌న్‌రెడ్డిపై మెగా ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. ఇప్పుడు టైం బాగాలేదు కాబ‌ట్టి స‌రే.. భ‌విష్య‌త్తులో ఇంత‌కు ఇంత‌కు బ‌దులిస్తాం అంటూ కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు చిరు ఫ్యాన్స్‌.

మ‌రోవైపు, చిరంజీవి అంత‌లా వేడుకోవ‌డంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మెగాస్టార్ మ‌రీ అంత‌గా దండం పెట్టి.. తండ్రిలాంటివారు.. చ‌ల్ల‌నిచూపు చూడండి.. అంటూ అడుక్కోవాల్సింది కాదంటూ నెగ‌టివ్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇదే అద‌నుగా.. చిరంజీవికి కంట్లో న‌లుసుగా మారిన ఆర్జీవీ సైతం రంగంలోకి దిగిపోయారు. మెగా కామెంట్ల‌ను.. మెగా బెగ్గింగ్ అంటూ ట్విట్ట‌ర్‌లో సెటైల‌ర్లు వేశారు. 

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అర్ధరాత్రి మరోసారి ట్విట్టర్ వేదికగా మద్దెల దరువు వేశారు. టాలీవుడ్ సమస్యలపై గురువారం నాడు చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, నారాయణమూర్తి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయి చర్చించారు. వారి చర్చలు ఓ కొలిక్కి వచ్చి, సమస్యకు శుభం కార్డు పడుతుందని సినిమా పెద్దలు, సామాన్యులు అంతా భావించారు.

అయితే.. సీఎం జగన్ తో చిరంజీవి మాట్లాడిన వైనాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. చిరంజీవి మాట్లాడిన తీరు మెగా బెగ్గింగ్ చేసినట్లు ఉందని, అందువల్ల మెగా ఫ్యాన్స్, తాను కూడా హర్ట్ అయ్యామంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ చిరంజీవిని టార్గెట్ చేస్తూ సెటైర్లు గుప్పించారు. ‘ఓ మెగా ఫ్యాన్ గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధపడ్డా’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

దాంతో పాటుగా మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మీలా బెగ్గింగ్ చెయ్యడని, అందుకే మీ కన్నా పవన్ ఎక్కువ పాపులర్ అయ్యారని మరో ట్వీట్ లో రాశారు. ఈ తరహా వ్యవహారాల్లో చిరంజీవిని మెగా ఫ్యాన్స్ ఇష్టపడరని అన్నారు. చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. ఆయనపై సెటైర్లు వేస్తూ వరస ట్వీట్లు చేసిన వర్మ కొద్ది సేపటి తర్వాత వాటిని తొలగించారు. దీంతో వర్మ తీరుపై ప్రజల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది.