TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోరు వానలు.. చండ్ర నిప్పులు.. ఏపీలో విభిన్న వాతావరణం

Published on: Mon Apr 6, 2026 9:42AM

 ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు జోరు వానలూ, మరో వైపు చండ్ర నిప్పులతో ఏపీ వాతావరణం ఉంది. రాష్ట్రంలో రానున్న రెండురోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో నిప్పులు చెరిగే ఎండలే, మరి కొన్ని జిల్లాలలో  పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

 దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.  వీటి ప్రభావంతో  సోమ, మంగళ (ఏప్రిల్ 6, 7) వారాల్లో ఈ ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై  పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక  పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో  ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.  

అదలా ఉండగా,  ఆదివారం (ఏప్రిల్ 5) పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 42.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 41.8, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 41.5, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 41.3, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.