TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ: మూడింట రెండొంతుల మెజారిటీ ఎన్డీయేకు సాధ్యమేనా.?

Published on: Fri Nov 27, 2026 8:36AM

దాదాపు వంద రోజుల తరువాత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నవంబరు 30 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో  రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి  ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సభలో మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఉంటేనే రాజ్యాం సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే సభలో ఎన్డీయే కూటమికి అందుకు అవసరమైనంత సంఖ్యా బలం లేదు. దీంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం అన్నది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సవాలుగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 నుంచి ప్రారంభమయయే పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ప్రవేశ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540 కాగా, మూడు ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్‌లో పాల్గొనే సభ్యులలో మూడింట రెండొంతుల మంది మద్దతు  తప్పనిసరి. సభలోని మొత్తం 540 మంది ఎంపీలు ఓటు వేస్తే బిల్లు నెగ్గడానికి కనీసం 360 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది.

ప్రస్తుత లెక్కల ప్రకారం లోక్ సభలో ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య 320.  వీరిలో  బీజేపీకి 241 మంది సభ్యులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైన 20 మంది రెబల్ ఎంపీలు ఎన్డీయే కూటమి పక్షాన నిలిచారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ శిండే సారథ్యంలోని శివసేనకు చెందిన 13 మంది ఎంపీలతో పాటు తెలుగుదేశం16, జేడీయూ  12 , ఎల్జేపీ-రామ్ విలాస్  5 , ఆర్‌ఎల్‌డీ  2 , జనసేన  2 , జేడీఎస్  2  ఇతర మిత్రపక్షాల సభ్యులు కలిపి ఈ సంఖ్య 320కి చేరింది. ఈ లెక్కన  మ్యాజిక్ ఫిగర్‌ 360కు ఎన్డీయేకు ఇంకా 40 మంది సభ్యుల మద్దతు అవసరం.

ఈ నేపథ్యంలో డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), వైసీపీల పాత్ర కీలకంగా మారింది. ఈ మూడు పార్టీలకూ కలిపి  మొత్తం 34 మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినా కూడా  మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా ఆరుగురి మద్దతు అవసరం అవుతుంది.  

ఇది కూడా చదవండి:   ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పావులు కదుపుతున్న కేంద్రం.!​

ఒకవేళ డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరై, ఎన్సీపీ,  వైసీపీలు మద్దతు ఇస్తే ఓటు వేసే సభ్యుల సంఖ్య 518కి తగ్గి మెజారిటీ మార్కు 346 అవుతుంది; ఆ పరిస్థితిలోనూ కూటమి బలం 332 వద్ద నిలిచి  మరో 14 మంది మద్దతు అవసరం అవుతుంది.  డీఎంకే, ఎన్సీపీకి చెందిన 30 మంది గైర్హాజరై వైసీపీ ఒక్కటే మద్దతు ఇస్తే ఓటింగ్ సంఖ్య 510కి చేరి 340 ఓట్లు అవసరమవుతాయి, కానీ కూటమికి 324 ఓట్లతో మరో 16 ఓట్ల కొరత ఏర్పడుతుంది.

గతంలో ఏప్రిల్ 17న ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యుల్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అవసరమైన 352 ఓట్ల కంటే 54 ఓట్లు తక్కువ రావడంతో ఆ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా  ఎన్డీయే సంఖ్యాబలాన్ని ఎలా సమీకరించుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.    

మీకు నచ్చవచ్చు: వంద రోజుల విరామానికి తెర.. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ భేటీ.!​

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం...అసలు వివాదం ఏంటి?


[Constitutional Amendment Bill, Parliamentsession, Loksabha, November30, NDAStrength, TeluguOne]