ఉద్యమకారుని కొడుకును బతికించడంలో కనికరించని ప్రభుత్వం!

ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిన ఉద్యమకారుడు సిద్దిపేట ముద్దు బిడ్డ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉన్నా, మోసపోతున్నాం అని తెలిసినా నిరసన తెలియజేయకూడని ఏకైక ఉద్యోగం పోలీస్. 24×7 డ్యూటీలోనే ఉంటూ అహర్నిశలు ప్రజాక్షేమం కోసమే శ్రమించే పోలీసు ఉద్యోగులు అసంతృప్తిని కూడా ప్రదర్శించకూడదు. 

కానీ మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారుల సహయంతో జరిగిన కృత్రిమ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2013లో జరిగిన మీటింగ్ లో సమైక్యాంధ్ర అవసరమనే తప్పుడు వాదనలు జీర్ణించుకోలేని అక్కడే బందోబస్తు నిర్వహిస్తూ, డ్యూటీ చేస్తున్న సిద్దిపేట (ఉమ్మడి మెదక్) జిల్లా కు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ ఒక్కసారిగా జై తెలంగాణ అని నినదిస్తు తన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను, సమైక్యాంధ్ర పేరుతో జరుగుతున్న మోసాన్ని చూసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. 

అక్కడ ఉన్న ఆంధ్రోళ్ళ ఆక్రోశానికి గురయ్యాడు. అయితే లక్షల మంది సమైక్యాంధ్రవాదుల మధ్య జై తెలంగాణ అని నినదించి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు హీరో అయ్యాడు. అప్పటికే టివి చానల్ లైవ్ లో విశ్లేషణలో కూర్చున్న ఇప్పటి ప్రభుత్వ ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ గారు అప్పటికప్పుడు పోలీసన్న అని పాట కట్టి పాడటం జరిగింది. అదే రోజు అప్పటి టిఆరెస్ (ఇప్పుడు బిజెపి) నాయకుడు జితేందర్ రెడ్డి గారు లక్ష రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. 

మిగతా నాయకులు కూడా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ ధీరత్వాన్ని మెచ్చి రివార్డులు ఇవ్వడం, సన్మానాలు చేయడం జరిగింది.    ఇలా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పేజీ రచించుకున్న వ్యక్తికి తను కలగన్న తెలంగాణ రాష్ట్రంలో ఆపద వస్తే ప్రభుత్వం ఆదుకోలేక పోవడం చేత తన కొడుకు గౌతమ్ కాళోజి ని పొగొట్టుకున్నాడు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కొడుకు కు వైద్యం చేయించాలంటే రూపాయలు 30 లక్షల అవసరం అని డాక్టర్లు చెప్పడంతో  తన కొడుకు ప్రాణాల కోసం ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబీకులను ట్విట్టర్ లో కాళ్ళు మొక్కుతా అని వేడుకోవడం అందరిని కలిచివేసింది. కేటీఆర్ గారు స్పందిస్తూ ఇప్పటికే 19 లక్షలకు పైగా పోలీసు డిపార్ట్మెంట్ నుండి అందివ్వడం జరిగింది అని, మిగిలిన ఖర్చును హరీష్ రావు భరిస్తారని చెప్పారు. 

అయితే సమయానికి వెంటనే పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే శ్రీనివాస్ గౌడ్ కొడుకు మరణించాడు అనేది నిజం. రాజకీయ నాయకులకు ఆపద వస్తే వెంటనే స్పందించే ప్రభుత్వం, ఉద్యోగులకు ఆపద వస్తే ఆ స్థాయిలో స్పందించట్లేదు. నాయకులకు కూడా పోలీసులే రక్షణ కల్పిస్తారని, అలాంటి పోలీసుల కుటుంబాలకు ఆపద వస్తే ఆదుకోవాలని ప్రభుత్వంలోని నాయకులకు తెలియకపోవడం సిగ్గు చేటని పౌరహక్కుల ప్రజాసంఘం ప్ర‌తినిధి ఎం.వి.గుణ తీవ్ర‌స్థాయిలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.