ఆల్ఫా ఇన్ ఫ్రాకు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్, టిడిపి నాయకులు
Published on: Mon Apr 9, 2012 4:56PM
విజయనగరం జిల్లా కొమరాడ ప్రాంతంలో ఆల్ఫా ఇన్ ఫ్రా ప్రాప్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు యాజమాన్యానికి కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల నాయకులు మద్దతు పలుకుతూ స్థానిక ప్రజలను వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ ప్రాంతంలో ధర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరికి ప్రజాహక్కుల సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ధర్మల్ ఫ్లాంట్ యాజమాన్యం స్థానికులను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్, టిడిపి నాయకులను చేరదీసింది. వారిని మేనేజ్ చేస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతోంది. కొందరు నాయకులు పవర్ ప్లాంట్ యాజమాన్యం నుంచి డబ్బులు తీసుకుని గ్రామస్తుల మధ్య విభేదాలకు ప్రయత్నిస్తున్నారు. ఈ నాయకులపై స్థానికులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటం లేదు. పవర్ ప్లాంట్ కు అడ్డుపడితే చంపేస్తామని ఈ నాయకులు హెచ్చరిస్తున్నారని, మహిళలపై చేయి చేసుకుంటున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అవసరమైతే తమ ప్రాణాలు ధారపోస్తామే తప్ప తమ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్ ను నెలకొల్పబోనీయమని వారు స్పష్టం చేస్తున్నారు.


