ఏపి పంచాయతీ ఎన్నికలలో బోణీ కొట్టిన కాంగ్రెస్.. సంబరాలు చేసుకున్న నేతలు
Published on: Wed Feb 10, 2021 9:44AM
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన దెబ్బతో ఏపీలో కుదేలై ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆ తరువాత జరిగిన ఏ ఎన్నికలలోను కనీసం డిపాజిట్ల మాట అటుంచి కనీసా స్థాయిలో కూడా ఓట్లు సాధించలేని స్థాయికి దిగజారిన సంగతి తెల్సిందే. దీంతో ఇక మరో 20 ఏళ్ల వరకు ఏపీలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే తాజాగా ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీకి జోష్ నింపే వార్త వచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి విడత ఎన్నికలలో ఆ పార్టీ మద్దతుదారు ఒకరు గెలవడం ఇక్కడ విశేషం. ఆ పార్టీ గెలిచింది ఒక స్థానంలోనే అయినా, ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడా లేనంత ఉత్సాహాన్ని నింపింది. దాదాపు రాష్ట్రంలో కనుమరుగైన ఆ పార్టీ మద్దతు ప్రకటించిన ఒక అభ్యర్థి గ్రామ సర్పంచ్ గా గెలుపొందడంతో కాంగ్రెస్‌పై ఇంకా ప్రజల్లో అభిమానం అలాగే ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గొంది సురేశ్ విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు సురేశ్ విజయం సాధించాడు. దీంతో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.


