TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ ఇంటి మీద కాకి.. ఈ ఇంటి మీద వాలకూడదు.. యశ్వంత్ పర్యటనపై రేవంత్

Published on: Sat Jul 2, 2022 2:30PM

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల ఐక్యత మూడడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. పేరుకు బీజేపీ యేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినా యశ్వంత్ సిన్హాకు ఒరిగిందేమీ లేదు. ఒక పార్టీ వారిని కలిస్తే మరో పార్టీ వారికి కోపం అన్నట్లుగానే ఆయన ప్రచార సరళి సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఆయనకు ఘన స్వాగతం ఏర్పాటు చేసింది.   ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో జలవిహార్ కు చేరుకున్నారు. జలవిహార్ లో సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను యశ్వంత్ సిన్హా కోరారు.

ఆ తరువాత 3.30 గంటల సమయంలో ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అవుతారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ పార్టీ కూడా బలపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ వస్తున్న క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. దీంతో యశ్వంత్ సిన్హా తన పర్యటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను కలవడానికే పరిమితమౌతున్నారు. తొలుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ భేటీ కావాలని యశ్వంత్ సిన్హా భావించినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్   నేతలు మాత్రం అందుకు విముకత వ్యక్తం చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ నేతలను కలవడానికి వస్తున్న నేపథ్యంలో తాము కలిసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై రేవంత్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి గడప తొక్కితే.. ఈ ఇంటి గడప తొక్కనివ్వం అన్న రేవంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కాకుండా రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హా కార్యాలయానికి సమాచారం అందించారు.