కాంగ్రెస్ టీడీపీకి అన్యాయం చేస్తుందా?

 

తెలుగు రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అదే తెలంగాణాలో మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీ దగ్గరవడం. అయితే తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యేలా టీడీపీ మహాకూటమికి మద్దతు తెలిపింది. నిజానికి తెలంగాణలో టీడీపీతో పొత్తుకి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నే ఎక్కువ ఉత్సాహం చూపింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ మహాకూటమి వైపు మొగ్గుచూపింది. పేరుకి మహాకూటమిలో కాంగ్రెస్ కాకుండా మూడు పార్టీలు ఉన్నాయనే కానీ.. కాంగ్రెస్ కి టీడీపీ నే ప్రధాన బలం.

టీజెఎస్ పార్టీలో కోదండరాం లాంటి బలమైన నేతలు ఉన్నారు కానీ బలమైన ఓటు బ్యాంకు లేదనే చెప్పాలి. ఇక సిపిఐ సంగతి సరేసరి. ఒకప్పుడు ఎర్రజెండాలు రెపరెపలాడాయి కానీ ఇప్పుడు ఆ ప్రభావం లేదనే చెప్పాలి. టీడీపీ పరిస్థితి అలా కాదు. ఎప్పటినుండో ఉన్న పార్టీ.. ప్రజలకు చేరువైన పార్టీ. 2014 ఎన్నికల అనంతరం మెజారిటీ నాయకులు పార్టీని వీడారు కానీ.. కేడర్ మాత్రం టీడీపీనే అంటిపెట్టుకొని ఉంది. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 10 శాతంపైనే ఓటు బ్యాంకు ఉంది. అందుకే కాంగ్రెస్ టీడీపీకి దగ్గరైంది. తమ బలానికి టీడీపీ బలం తోడైతే అధికారం ఈజీగా పొందొచ్చని భావించింది. అయితే అలాంటి టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

సీట్ల కేటాయింపు విషయంలో మిగతా పార్టీలను చూసినట్టు కాంగ్రెస్, టీడీపీని చిన్నచూపు చూస్తుంది. టీడీపీ తెలంగాణలో దాదాపు 40 స్థానాలలో బలంగా ఉంది. ఈ 40 స్థానాల్లో టీడీపీ.. మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశముంది. ఈ లెక్కల ప్రకారం టీడీపీకి 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం 10,15 సీట్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో తెలంగాణ టీడీపీ నేతలు కూడా గట్టిగా పట్టుబట్టడం లేదు. ఏదో సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఎన్ని సీట్లిస్తే అన్ని చాలులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే టీడీపీ కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. ఇంత బలమైన కేడర్ ఉన్న పార్టీకి 10 స్థానాలు ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంటి నేతలు టీడీపీలో ఉండి ఉంటే కనీసం 25 సీట్లైనా కావాలని కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఇక చంద్రబాబు తెరమీదకు వచ్చి సీట్ల గురించి మాట్లాడి కనీసం 25 సీట్లైనా వచ్చేలా చూడాలని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కాంగ్రెస్ పది సీట్లు కేటాయించి టీడీపీ ఓటుబ్యాంకుతో లబ్ధిపొందాలని చూస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టి పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.