ఆంద్రప్రదేశ్ పై అప్పుడు లేని ప్రేమ ఇప్పుడేల?

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర ప్రజలు భావించినందునే ఆ పార్టీని ఎన్నికలలో మట్టి కరిపించారు. అటువంటపుడు ఆ పార్టీ పశ్చాతాపం ప్రకటించి ఉండి ఉంటే ప్రజలు మళ్ళీ దానిని ఆదరించేవారేమో? కానీ తన తప్పును ఒప్పుకోకపోగా రాష్ట్ర విభజన వలన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి లాభమే జరిగిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను మరింత రెచ్చగొట్టినట్లయింది. లక్షలాదిమంది రాష్ట్ర ప్రజలు రోడ్లమీదకు వచ్చి రాష్ట్ర విభజనని వ్యతిరేకించినా ఆనాడు నోరు విప్పని రాహుల్ గాంధీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల తరపున కేంద్రంతో ప్రత్యేకహోదా గురించి పోరాటం చేస్తారుట! తన యూపీఏ ప్రభుత్వమే స్వయంగా తయారుచేసి ఆమోదించిన ఆర్డినెన్స్ ని నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి వాపసు తీసుకొనేలా చేశారు. కానీ అనేక దశాబ్దాలపాటు తన కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని ఆదరించిన ఆంద్రప్రదేశ్ ప్రజల పట్ల నిజంగానే రాహుల్ గాంధీకి అభిమానం ఉండి ఉంటే మరి ఆనాడు తన తల్లి సోనియా గాంధీ రాష్ట్రాన్ని బలవంతంగా విడగొడుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఆనాడు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఎందుకు వాయిదా వేయించలేదు? అని ఆలోచిస్తే అప్పుడు ఆయన తన పార్టీ ప్రయోజనాల గురించి మాత్రమే మిన్నకుండిపోయారని అర్ధమవుతోంది.

 

ఇప్పుడు ఆయన రాష్ట్రంలో పాదయాత్రలు, భరోసా యాత్రలు చేసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొంటున్నారు. కానీ ఆ సమయంలో ఒకసారి కూడా రాష్ట్రానికి వచ్చి ప్రజల అభిప్రాయంతెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నామనే అహంకారం. ఇప్పుడు ప్రజలని మంచి చేసుకొని మళ్ళీ రాష్ట్రంలో పార్టీని బలపరుచుకోవాలనే తపన అంతే! అందుకే ఇప్పుడు ఆయన కూడా ప్రత్యేకహోదా గురించి పార్లమెంటులో పోరాడేందుకు సిద్దమయిపోతున్నారు. కానీ ఇప్పుడయినా నిజాయితీగా పోరాడుతున్నారా? అంటే లేదనే అర్ధమవుతోంది.

 

ఈ ప్రత్యేకహోదా సాకుతో రాష్ట్రప్రజలను మళ్ళీ ఆకట్టుకోవాలనే తపన, ఈ విషయంలో ఇబ్బందిపడుతున్న తన రాజకీయ ప్రత్యర్ధులయిన తెదేపా, బీజేపీలను దెబ్బ తీయాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఇదంతా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆయన ఏమి చేసినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించుకోవడం అసంభవమనే చెప్పవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకొంటుందని భావిస్తే బొత్స సత్యనారాయణ వంటి నేతలు పార్టీని వీడేవారే కాదు. ఒకవేళ రాహుల్ గాంధీకి రాష్ట్రంలో తన పార్టీని మళ్ళీ బ్రతికించుకోవాలంటే రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకొంటే ఏమయినా ఫలితం ఉండవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని (రాష్ట్రాన్ని, ప్రజలని) పణంగా పెట్టి మరీ తెలంగాణా ఇచ్చామని అక్కడ గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, అందుకు పశ్చాత్తాపం ప్రకటించలేరు. అలాగా చేస్తే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బయిపోతుంది. కనుకనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరూ పైకి ఆమాట చెప్పుకోలేకపోతున్నారు.

 

ఆ సంగతి ప్రజలూ అర్ధం చేసుకోగలరు. ఆమాట చెప్పకపోయినా పరువాలేదు కానీ “రాష్ట్ర విభజన వలన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగలేదు అంతా లాభమే జరిగిందని” చెపుతూ ఇటువంటి పోరాటాలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మబోరు, క్షమించబోరని రాహుల్ గాంధీ గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.