కారు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పయనిస్తాయా? తెలంగాణ రాజకీయాల దారెటు ? 

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్  పనిచేయబోనుందా? బీజేపీ దూకుడుతో ఈ రెండు పార్టీలు వ్యూహం మార్చాయా? అంటే తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. భవిష్యత్ లో కాంగ్రెస్  టీఆర్ఎస్ కలిసి పని చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని తెలుస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  ఈ రెండు పార్టీలు ఉద్యమం చేస్తుండటంతో.. ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. టీఆర్ఎస్ తో కలిసి పని చేయాల్సి  రావచ్చనే సంకేతం తెలంగాణ పీసీసీ నేతలకు హైకమాండ్ కూడా ఇచ్చిందంటున్నారు.  అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా... తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే కూటమిలో కాంగ్రెస్ చేరబోతుందా లేక కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు వెనుక నుండి కాంగ్రెస్ సపోర్ట్ చేయనుందా అన్నదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. 

 

2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడుతోంది.  కాంగ్రెస్ ‘ముక్త్ భారత్‌’ నినాదంతో కమలనాథులు ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాలను కాషాయమయం చేశారు.  కీలక రాష్ట్రాల్లోని నేతలకు కాషాయ కండువాలు కప్పి, కాంగ్రెస్‌ను అంతర్గతంగా దెబ్బతీస్తున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ కనపడక పోవడం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీకి ఎదురు లేకుండా పోతుందనే చర్చ జరుగుతోంది. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మూడో కూటమి అంశం తెరపైకి వస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతానని చెబుతున్నారు. చెప్పినట్లుగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో కొత్త కూటమికి ప్లాన్ చేస్తే..  బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆ కూటమితో కాంగ్రెస్  కలిసి నడవాల్సిన అవసరం రావొచ్చని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

 

గత మూడేళ్లుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్.  2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ వెళ్లి దేశానికి దిశా నిర్దేశం చేస్తానన్నారు. కానీ ఎన్డీయే భారీ మెజార్టీతో గెలవడంతో తన ప్రయత్నాలను వాయిదా వేసుకున్నారు కేసీఆర్. కొంతకాలం బీజేపీతో సఖ్యతగానే మెలిగారు.  రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాల అనంతరం గులాబీ బాస్  వైఖరిలో మార్పొచ్చింది. కేంద్ర సర్కార్ పై ఆయన ఘాటు విమర్శలు చేస్తున్నారు. దేశానికి బీజేపీతో నష్టమని చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలంతా ఆందోళనలో పొల్గొన్నారు. మంత్రులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కాంగ్రెస్‌ సైతం ధర్నాల్లో పాల్గొంది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, కారు పార్టీ నేతలు కలిసే ఆందోళనలు చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజీ కుదిరిందన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. 

 

జాతీయ రాజకీయాల్లోకి  వెళ్లేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్నారు కేసీఆర్. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న లెప్ట్‌ పార్టీలు సైతం  కేసీఆర్‌ కూటమికి సపోర్ట్ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అవసరమైతే వామపక్ష నేతల ఇళ్లకు  వెళ్లి మాట్లాడుతానని కేసీఆర్‌ చెబుతుండటం ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ తో కలవాల్సిన పరిస్థితులు ఉంటాయనే  చర్చలు సాగుతున్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో జట్టుకట్టడమా? లేకుంటే బయట నుంచి సపోర్టు చేయడమా? అన్నది మాత్రం హస్తం పార్టీలో స్పష్టత లేదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున.. మరికొన్ని రోజుల తర్వాతే కేసీఆర్ కార్యాచరణపై క్లారిటీ వస్తుందంటున్నారు.  అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని ఆ తర్వాత మాట మార్చారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్  కేసీఆర్ ను నమ్మి మద్దతిస్తుందా లేదా అన్నది కూడా ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ కనుక టీఆర్ఎస్ తో కలిసి జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.