ఎట్టకేలకు మహాకూటమి లెక్క కుదిరింది

 

కేసీఆర్ ముందస్తుకు తెరలేపి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనుకుంటే.. ప్రతిపక్షాలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే అందరికీ ఎక్కడో డౌట్.. అసలీ మహాకూటమి నిలబడుతుందా? అని. ఎందుకంటే మహాకూటమితో ఎవరి ఊహలకు అందని పార్టీలు జతకట్టాయి. అవే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు. కానీ అందరూ అనుకున్నట్టు ఈ పార్టీల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి సమస్య రాలేదు. టీడీపీ, కాంగ్రెస్ తో దోస్తీ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. గతంలో ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ని వ్యతిరేకించాం.. కానీ ఇప్పుడు ప్రజావసరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ఏర్పడడం ముఖ్యం అని భావించి సీట్ల విషయంలో సర్దుకుపోవడానికి టీడీపీ సిద్ధమైంది. ఇక సీపీఐ కూడా సీట్ల విషయంలో మరి పట్టుబట్టలేదు. అయితే టీజేఎస్‌ మాత్రం మొదట్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. సీట్ల కేటాయింపు విషయంలో జాప్యం.. అలాగే తమ పార్టీకి మరీ తక్కువ సీట్లు కేటాయిస్తాననడంతో కోదండరాం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసారు. కానీ ఏ సందర్భంలోనూ ఆయన కూటమికి దూరం అవుతాననే సంకేతాలు ఇవ్వలేదు. దీంతో మహాకూటమి ఏర్పడటం ఖాయమనే అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల లెక్క కుదిరినట్టు తెలుస్తోంది.

కేంద్రంలో ఎలాగైతే బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పోవడమే కాకుండా.. అవసరమైతే పీఎం పదవి త్యాగానికి కూడా సిద్దమైందో.. అలాగే తెలంగాణలో కూడా తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే చాలా సహనంగా అడుగులు వేస్తూ.. కూటమిలోని మిగతా పార్టీలు సంతృప్తి పడేలా చేస్తూ.. ఎట్టకేలకు మహాకూటమి నిలబడేలా చేసుకుంది. ప్రస్తుతం మహాకూటమి ముందున్న టార్గెట్ ఒక్కటే.. కేసీఆర్ ని గద్దె దించడం. అందుకే మహాకూటమిలోని పార్టీలు సీట్ల విషయంలో మొండిగా పట్టుపట్టలేదు. దీంతో సీట్ల లెక్క ఓ కొలిక్కొచ్చింది. మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90, టీడీపీ 15, టీజేఎస్‌ 10, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగబోతున్నాయి. అంతేకాదు కూటమిలోని పార్టీలు విడివిడిగా కాకుండా.. ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటించనున్నాయి. తొలి జాబితాలో 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల లెక్క కుదరడంతో పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది.. మరి తెరాసను ఓడించాలన్న ఆ పార్టీల లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.