TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈడీ సమన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వీధి పోరాటాలు ..?

Published on: Thu Jun 9, 2022 3:27PM

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాన్లు జారీ చేసింది. విచారణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో,  కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తోందా, అంటే, రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 

గతంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి, కొరివితో తల గోక్కుంది. అంతకు కొద్ది నెలల ముందు జరిగిన ఎన్నికలో  కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన ప్రజలే, ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ ( జనతా) ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేయడాన్ని క్షమించ లేక పోయింది. అందుకే కేవలం 11 నెలలలోనే జనతా ప్రభుత్వం కూలిపోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికలలో  ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నా. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అగౌరవ పరిచినా, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసి అవమానాలపాలు చేసినా దేశ ప్రజలు క్షమించరని. కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును రాజకేయంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అదలా ఉంటే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యే సమయంలో దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనలు నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ  అనారోగ్యం కారణంగా, నిన్న (బుధవారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కాలేదు. నిజానికి పక్షం రోజుల క్రితమే, జూన్ 8 న విచారణకు హాజరు కావాలని, ఈడీ ఆమెకు సమన్లు జారీచేసింది. అయితే, ఇటీవల ఆమెకు  కరోనా సోకినా నేపధ్యంలో విచారణకు మూడు వారాలు గడవు కోరారని, కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల కరోనా బారిన పడిన సోనియా.. ఇంకా కోలుకోని కారణంగా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని.. విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నాయి.

మరోవంక ఇదే కేసులో, సమన్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కూడా విదేశాలలో ఉన్న కారణంగా, జూన్ 2 న విచారణకు హాజరు కాలేదు. అయితే అయన అభ్యర్ధన మేరకు ఈడీ విచారణను జూన్ 13కు వాయిదా వేసింది. కాగా,రాహుల్ గాంధీ ఈనెల 13న విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం. మరో వంక ఇదే కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను కూడా ఈడీ ప్రశ్నించింది.

మరోవంక  నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణల జుగల్ బందీ నడుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయదాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. నేషనల్ హెరాల్ద్ కేసు విషయంలో సోనియా, రాహుల్ ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా పేర్కొన్నారు. బీజేపే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ‘నేరం చేసిన వారు ఎవరైనా నేరం చేశామని అంగీకరిస్తారా?   అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తల్లీ కొడుకులు నేరం చేయందే నిజం అయితే ఆ ఇద్దరూ  విచారణకు హాజరై, తమ నిజాయతీని నిరూపించుకోవాలని నడ్డా కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు.  

అదలా ఉంటే కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. మరో వంక  ఈనెల 13న ఈడీ విచారణకు హజరుకావాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ హజరయ్యే రోజు.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులందరినీ పిలిచినట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు అంశంపై చర్చించనున్నారు. రాహుల్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరైన రోజు.. దేశ వ్యాప్తంగా భారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహించే యోచనలో ఉంది కాంగ్రెస్‌. సోనియా, రాహుల్‌ ఈడీ విచారణకు హాజరు అయ్యే అంశంపై పార్టీ సినియర్‌ నేతలు చర్చించినట్లు ఏఐసిసి వర్గాల వెల్లడించాయి. ఈ రోజు (గురువారం) వర్చువల్‌గా జరిగిన భేటీకి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జులు   ఏఐసీసీ ఆదేశాలమేరకు హాజరయ్యారు.

సో.. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు రాజకీయ మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే, న్యాయస్థానాల్లో తేల్చుకోవలసిన అంశాన్ని వీధుల్లోకి తీసుకురావడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం దక్కుతుందా లేక అది కూడా బూమ్రాంగ్ అవుతుందా అనే విషయంలో  కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.