TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై బీజేపీ కన్ను... తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌

Published on: Tue May 16, 2017 10:39AM

 

తెలంగాణలో అప్పుడే కూడికలు తీసివేతలు మొదలైయ్యాయి. పార్టీలన్నీ పక్కా స్కెచ్‌తో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణపై కన్నేసిన బీజేపీ అధిష్టానం యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయడం మొదలుపెట్టింది. ఆపరేషన్‌ సెవెన్‌ స్టేట్స్‌లో భాగంగా తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరదీసిన కమలం పార్టీ... టీడీపీ, కాంగ్రెస్‌లో ముఖ్యనేతలపై కన్నేసింది. ఇప్పుడున్న నేతలతోనే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని అంచనాకి వచ్చిన బీజేపీ హైకమాండ్‌... టీడీపీ, కాంగ్రెస్‌లో ప్రజాబలం, పేరున్న నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

 

కమలం యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా... ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల్లో ఫైర్‌ బ్రాండ్‌లుగా పేరున్న పలువురు నేతలు... బీజేపీలో చేరేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారన్నది లేటెస్ట్‌ న్యూస్‌. అయితే టీడీపీ, కాంగ్రెస్‌లో బలమైన నేతలు బీజేపీలోకి వస్తే.... తమ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని పాత కాపులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. దాంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఇతర పార్టీల నేతల ప్రయత్నాలకు మోకాలడ్డుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే దీన్ని గమనించిన ఆయా లీడర్లు... నేరుగా ఢిల్లీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

 

తెలంగాణ పర్యటనలో అమిత్‌షా‌ను కలిసేందుకు ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమిత్‌షా మీదే ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరినా.... ఇప్పుడున్న నేతలు... కలుపుకొని పోతారో లేదోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. బీజేపీ అధిష్టానం సానుకూలంగా ఉన్నా... రాష్ట్ర నేతలు మాత్రం మోకాలడ్డే ప్రయత్నాలు చేయడంపై కలవరపడుతున్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే.... కనీసం ప్రస్తుతమున్న పార్టీలో దక్కుతున్న ప్రాధాన్యత అయినా దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.