మోడీని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం

 

నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా నిలబెట్టే విషయంలో నేటికీ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కుమ్ములాడుకొంటుంటే, మరోపక్క ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయిన మోడీ తనపని తానూ చేసుకుపోతూనే ఉన్నాడు. ఇదంతా చూస్తున్నకాంగ్రెస్ పార్టీ కూడా తన జాగ్రత్తలో తానూ ఉండాలనే ఆలోచనతో మోడీని అడ్డుకొనేందుకు తనపని తానూ చేసుకుపోతోంది.

 

ఒక దశాబ్ధం క్రితం గుజరాత్ లో జరిగిన గోద్రా సంఘటన, తదనంతర మారణఖాండను కాంగ్రెస్ నేతలు పదేపదే ఎత్తి చూపుతూ మోడీ ఒక కరడుకట్టిన మతతత్వవాది అని, అందువల్ల అతను ప్రధాని పదవి చేపట్టడానికి అనర్హుడని గట్టిగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో మోడీని వ్యతిరేఖిస్తున్ననితీష్ కుమార్ వంటి వారిని కూడా ప్రోత్సహిస్తూ, గుజరాత్ లో కంటే బీహార్ వంటి రాష్ట్రాలలోనే బాగా అభివృద్ధి జరగుతోందని ప్రచారం చేయిస్తోంది.

 

ఇక కాగల కార్యం గందర్వులే చేస్తారన్నట్లు, బీజేపీకే చెందిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి వారు కూడా గుజరాత్ కంటే తమ రాష్ట్రంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేసుకోవడం, దానికి మోడీని వ్యతిరేఖిస్తున్న అద్వానీ వంటివారు వత్తాసు పలకడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. మోడీ ప్రచారం చేసుకొంటున్నట్లుగా గుజరాత్ లో ఏమీ అద్భుతాలు జరిగిపోవడం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ గట్టిగానే చేస్తోంది.

 

తద్వారా, గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపధంలో నడిపిస్తునందున, మోడీ చేసిన తప్పులను క్షమించడానికి సిద్దపడుతున్నప్రజల మనస్సులో మోడీ పట్ల ఏర్పడుతున్న మంచి అభిప్రాయాన్నిపూర్తిగా తుడిచిపెట్టి, రానున్న ఎన్నికలలోగా అతనిపట్ల ప్రజలు మళ్ళీ ఏహ్యభావం పెంపొందించుకొనేలా చేసేందుకు కాంగ్రెస్ ఈ దీర్గకాలిక ప్రణాళికతో ముందుకు సాగిపోతోంది.