బీజేపీలోకి విజయశాంతి.. ఈ నెల 18న ముహూర్తం!!

 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. పార్టీ బలోపేతం కోసం కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకొనే కార్యాచరణ వేగవంతం చేసింది. టీపీసీసీ ప్రచారకమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతితోపాటు పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. గతంలో బీజేపీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. ఆ తరువాత పార్టీ మారిన విజయశాంతి తిరిగి ఇప్పుడు సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు అమెతో సంప్రదింపులు పూర్తి చేసినట్లు సమాచారం.

తెలంగాణ సాధన కోసం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి.. తరువాత టీఆర్ఎస్ లో విలీనం చేసారు. టీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీగా గెలిచారు. అయితే తరువాత పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కకపోవటంతో టీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలోనూ విజయశాంతికి సరైన ప్రాధాన్యత లభించటం లేదు. కీలక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం అందటం లేదు. దీంతో.. పార్టీలో కొనసాగలేమనే అభిప్రాయానికి విజయశాంతి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతల నుండి సంప్రదింపులు మొదలయ్యాయి. ఇక, సొంత గూటికే చేరాలని విజయ శాంతి నిర్ణయించినట్లు సమాచారం.

తెలంగాణలో కీలక నేతలను ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించింది. ముఖ్య నేతల ద్వారా నేరుగా వారితో సంప్రదింపులు కొనసాగిస్తోంది. అందులో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎ్‌సకు చెందిన కొంతమంది ముఖ్యనేతలు ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన మొత్తం ముగ్గురు మాజీ ఎంపీలు, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు, మరో మాజీ డిప్యూటీ సీఎంతో పార్టీ నాయకత్వం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా హైదరాబాద్‌ రానున్నారు. ఆ సమయంలో విజయశాంతి, మరికొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశముందని తెలుస్తోంది.