రోహిత్ శర్మను కించపరిచేలా వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతపై సర్వత్రా విమర్శలు
Published on: Mon Mar 3, 2025 3:30PM

అనవసర వివాదాలు సృష్టించడం, వాటిలో ఇరుక్కుని నిండా ములగడంలో కాంగ్రెస్ నేతలకు ఎవరూ సాటిరారు. అందుకే కాంగ్రెస్ ను ఎవరూ ఓడించలేరు.. ఆ పార్టీయే తన ఓటమిని లిఖించుకుంటుందని రాజకీయవర్గాలు అంటుంటాయి. అంతర్గత విభేదాలు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండే ఆ పార్టీ నేతల వ్యవహార శైలి కాంగ్రెస్ కు శాపంగా మారుతుంటాయి.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ అక్షర సత్యాలు అనిపించక మానదు. ఆ పార్టీ నాయకులు తమంత తాముగా వివాదాలలో చిక్కుకోవడమే కాకుండా పార్టీని కూడా లాగుతారనడానికి తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిథి షమా మహమ్మద్తఒక అనవసర వివాదానికి తెరలేపడమే తార్కాణం. తానుగా ఒక అనవసర వివాదానికి తెరలేపి.. పార్టీ పరువును గంగలో కలపడమే కాకుండా, తటస్థ వర్గాలలో కూడా పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకత పెరిగేలా చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ అధికార ప్రతినిథి డాక్టర్ షమా మెహమ్మద్ భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుండగా ఎక్స్ వేదికగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనను బాడీ షేమింగ్ చేశారు. రోహిత్ శర్మ ఒక స్పోర్ట్స మెన్ గా ఉండటానికి వీల్లేనంత లావుగా ఉన్నారన్న వ్యాఖ్యలు చేశారు. ఆయన టీమ్ ఇండియాకు బరువు అన్న అర్ధం వచ్చేలా డాక్టర్ షమా మొహమ్మద్ వ్యాఖ్యలు ఉన్నాయి.
మ్యాచ్ లో తొలుత టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ 17 బంతులు ఆడి 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సరిగ్గా అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిథి రోహిత్ శర్మను కించపరిచేలా ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్లలో చెత్త రికార్డు ఉన్న వ్యక్తిగా ఆమె పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఆమె ఈ పోస్టును డిలీట్ చేశారనుకోండి అది వేరే విషయం. కానీ ఆలోపే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్ లో భారత్ కు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థన్ మీడియా షమా రోహిత్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి బ్యాట్స్ మెన్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే షమా వెంటనే స్పందిస్తూ..రోహిత్ ఏం సాధించారని ప్రశ్నించారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీల ఘనతలను ప్రస్తావిస్తూ వారితో పోలిస్తే రోహిత్ శర్మ సాధించింది శూన్యమంటూ పేర్కొన్నారు. రోహిత్ ను అతి సామాన్యమైన కెప్టెన్, క్రికెటర్ గా అభివర్ణించారు.
షమా వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిథి ప్రదీప్ భండారీ షమా వ్యాఖ్యలను తప్పుపట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా అన్ని విధాలుగా విఫలమైన కాంగ్రెస్ ఇప్పుడు క్రికెట్ ను కూడా విఫల క్రీడగా మార్చాలనుకుంటోందా అని ప్రశ్నించారు. రాజకీయాలలో విఫలమైన ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని పార్టీ భావిస్తోందా అని ఎగతాళి చేశారు.
ఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిథి షమా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవుపలికారు. ఇలా ఉండగా షమా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్కేహ్రా అన్నారు. షమా తన వ్యాఖ్యలను ఎక్స్ నుంచి తొలగించి భవిష్యత్ లో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని హితవు చెప్పారు. ఇంత జరిగిన తరువాత షమా తన వ్యాఖ్యలను తొలగించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా మారింది.


