TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ రకంగా కూడా కాంగ్రెస్ వల్ల ఏపీకి నష్టం...

Published on: Wed Aug 27, 2014 4:33PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టే దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదంటూ ప్రజలు గత ఎన్నికలలో స్పష్టంగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని గబ్బిలం పట్టుకున్నట్టు పట్టుకుని వేలాడుతోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి లాభాలు లేకపోగా ఎన్నో నష్టాలు ఎదురవుతున్నాయి. తాజాగా మరో నష్టం ఎదురవుతోంది.

 

నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే మంచి నాయకుడు తంగిరాల మరణం ఆ ప్రాంతంలోని ప్రజల మనసులను కలచివేసింది. ఆ స్థానం నుంచి ఆయన కుమార్తె సౌమ్యను అసెంబ్లీకి పంపించాలన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇండిపెండెంట్లు ఎవరూ పోటీచేసే ఉద్దేశంలో లేరు. ఒకవేళ ఎవరైనా పోటీ చేసినా వారికి సర్దిచెప్పి నామినేషన్ ఉపసంహరింపజేసే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే శోభానాగిరెడ్డి మరణం వల్ల ఖాళీగా వున్న ఆళ్ళగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకుండా వుండాలంటే నందిగామ స్థానం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య మీద అభ్యర్థిని పోటీకి నిలపకుండా వుండాలి. ఒకవేళ వైసీపీ తన అభ్యర్థిని ఇక్కడ పోటీకి నిలిపినా గెలిచే అవకాశాలు లేవు. అందువల్ల వైసీపీ అభ్యర్థిని నిలిపే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.

 

అయితే నందిగామ నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకుంది. బోడపాటి బాబూరావును ఈ స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సమాధి అయిపోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికే ఇక్కడ పోటీకి నిలబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీకి నిలవడం వల్ల ఇక్కడ ఎన్నిక తప్పనిసరి అయ్యే అవకాశం వుంది. దానివల్ల ఎన్నిక నిర్వహణకు ప్రజాధనం చాలా ఖర్చవుతుంది. రూపాయి కూడా ఖర్చు కాకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగాల్సిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలబడి ఈ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది.