జంప్ అవ్వడానికి భలే సాకు దొరికింది

ఎండిపోయి, మోడువారిపోయిన పార్టీని వదలి పచ్చగా కళకళలాడుతున్న పార్టీలోకి జంప్ కావడానికి రాజకీయ నాయకులు భలే భలే సాకులు వెతుక్కుంటూ వుంటారు. ఆ సాకు జనం ముందు పెట్టేసి ఎంచక్కా జంపైపోయి అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఇండియన్ పాలిటిక్స్‌లో ఇలాంటివి మామూలే. ఒక నాయకుడు ఫలానా పార్టీ విధానాలు తెగ నచ్చేసి పార్టీ మారిపోయానంటాడు. మరో నాయకుడు కార్యకర్తల డిమాండ్ మేరకే పార్టీ మారుతున్నానని చెప్తాడు. ఇంకో నాయకుడు ఇప్పుడున్న పార్టీలో తనను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి పార్టీ మారేస్తున్నానంటాడు. మొత్తం మీద పార్టీ మారడం అనేది కామన్ పాయింట్. దానికి చెప్పే సాకు మాత్రం పరిస్థితిని బట్టి మారుతూ వుంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. మోడువారిపోయిన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి హవా నడిపించడానికి వీలున్న పార్టీకి మారిపోవాలని ఈ బ్రదర్స్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఆప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్టు పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి ఎమ్మెల్యే కమ్ మినిస్టర్‌గా అన్న వెంకటరెడ్డి, ఎంపీగా తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి బోలెడన్ని కాంట్రాక్టులను సొంతం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదిగిపోయారు. తెలంగాణ సాధన ఉద్యమంలో అన్నదమ్ములిద్దరూ మహా దూకుడుగా వ్యవహరించారు. అయితే తెలంగాణ  ఇచ్చిన తర్వాత ఆ క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్‌ని మూల కూర్చోబెట్టింది. దాంతో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కాలూ చేయీ ఆడటం మానేశాయి. అధికార  టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడానికి నానా ప్రయత్నాలూ చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా వున్న పొన్నాల లక్ష్మయ్య మీద ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. పీసీసీ నాయకత్వం బాగాలేదు కాబట్టి పార్టీ మారాం అని చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టడంతోపాటు ఈ అన్నదమ్ముల్ని పార్టీలోకి తీసుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం ఆసక్తి చూపించకపోవడంతో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు.

 

ఈమధ్యకాలంలో అటు కేంద్రంలో బీజేపీ బాగా బలపడిపోయింది. తెలంగాణలో కూడా ఈ పార్టీ విషయంలో ఆశావాద ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ విషయంలో అటూ ఇటూ అయినా కేంద్రంలో మాత్రం బీజేపీ జెండాకి ఢోకా లేని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఆ పార్టీలోకి జంప్ కావడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ స్కెచ్ వేశారు. తమ స్కెచ్‌ని అమల్లోకి పెట్టడం కోసం ఒక బలిపశువును వెతికారు. ఆ బలిపశువే ప్రస్తుత టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన మీద మెల్లమెల్లగా విమర్శలు మొదలుపెట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇటీవలి కాలంలో విమర్శల ఘాటును మరింత పెంచారు. తెలంగాణ రావడం మూడేళ్ళు ఆలస్యం కావడానికి ఉత్తమ్‌కుమారే కారణమనే కొత్త పాయింట్‌ని లేవనెత్తారు. ఉత్తమ్ కుమార్‌ని పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తొలగించకపోతే కాంగ్రెస్‌లో కొనసాగలేమంటూ మనసులోని మాటను కూడా బయటపెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ పోరు భరించలేక ఇప్పటికే ఓసారి పీసీసీ అధ్యక్షుడిని మరోసారి మార్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అలాంటి పని చేయదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కావలసింది కూడా అదే కాబట్టి ఆ సాకు చూపించి ఎంచక్కా బీజేపీలోకి జంప్ అయిపోతారని విశ్లేషిస్తున్నారు.