అందుకే డొక్కా రఘువీరారెడ్డిని విమర్శిస్తున్నారా?

 

కాంగ్రెస్ పార్టీలో కీచులాడుకోవడానికి పెద్ద కారణాలేవీ అవసరం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు మరో మారు నిరూపిస్తున్నారు. పార్టీలో అనేకమంది వారిస్తున్నా వినకుండా పీ.సి.సి. అధ్యక్షుడు రఘువీర రెడ్డి నందిగామ ఉప ఎన్నికలలో దళితుడిపై కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టి పార్టీకి పరాజయం కట్టబెట్టారని, కానీ ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో ఉన్నత వర్గానికి చెందిన ప్రత్యర్ధిపై పార్టీ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టేందుకు వెనుకాడటం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆయన విమర్శించారు. భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే పోటీకి విముఖత చూపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని డొక్కా విమర్శించారు. ఒక్కో ఉప ఎన్నికలలో ఒక్కో విధానం అవలంభించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉన్నట్లు తన ప్రత్యర్ధులకు చాటిచెప్పు కొన్నట్లుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం గురించి తను కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.

 

నందిగామ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధిని నిలబెట్టడం తప్పుడు నిర్ణయమేనని చెప్పవచ్చును. బహుశః అదే కారణంతో ఇప్పుడు ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు రఘువీర రెడ్డి వెనుకంజవేసి ఉండవచ్చును. అయితే ఆయన ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో కారణాన్నికూడా డొక్కా బయటపెట్టడం వల్ల రఘువీర రెడ్డికి ఆయన ఇబ్బందికర పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేసినట్లు కనబడుతోంది.

 

డొక్కా వాదన వినేందుకు బాగానే ఉన్నప్పటికీ దాని వలన కూడా పార్టీలో నెలకొని ఉన్న విభేదాలు అయోమయ పరిస్థితి బయటపెట్టుకొన్నట్లయింది. అందుకు డొక్కాను కూడా తప్పు పట్టవలసి ఉంటుంది. అయితే తనకు దక్క వలసిన పీ.సి.సి అధ్యక్ష పదవి రఘువీరా రెడ్డికి దక్కిందనే అసంతృప్తి వలనే ఆయన రఘువీర రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణా పీ.సి.సి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కుర్చీలో నుండి దింపేసి అందులో తాము కూర్చొనేందుకు టీ-కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే కుస్తీ పట్లు పడుతున్న సంగతి ప్రత్యక్షంగా అందరికీ కనబడుతోంది. కానీ ఆంధ్రాలో కూడా రఘువీర రెడ్డి కుర్చీ క్రింద మంట రాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డొక్కావారు చాటి చెప్పినట్లయింది. ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఈవిధంగా మరోసారి బయటపడ్డాయి.