TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాబర్ట్ వాద్ర దెబ్బకి హర్యానాలో కాంగ్రెస్ ఫినిష్?

Published on: Mon Oct 6, 2014 9:49PM

 

ఈ నెల 15వ తేదీన మహారాష్ట్ర మరియు హర్యాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఇంత వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షమయిన యన్.సి.పీ. మద్దతు ఉపసంహరించుకోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు అధికారంలో నుండి దిగిపోవలసి వచ్చింది. అందువలన అక్కడ బీజేపీ, శివసేన పార్టీలతో బాటు మిత్ర పక్షమయిన యన్.సి.పీ.ను కూడా డ్డీ కొనవలసిరావడంతో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం చాలా కష్టమేనని భావించవచ్చును.

 

ఇక నేటికీ హర్యానాలో ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ పరిపాలన సాగుతున్నప్పటికీ, ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్న అస్త్రాలకు కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్ర మరియు డి.యల్.యఫ్. సంస్థల మధ్య హర్యానాలో జరిగిన భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా ప్రభుత్వం సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అశోక్ కిమ్కాను బదిలీ చేసింది. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర పైనే అయింది. అప్పట్లో అది చాలా సంచలనం సృష్టించింది. కానీ ఇప్పడు ఎన్నికల ముందు భూపేంద్ర సింగ్ హుడా ప్రభుత్వం ఆదరా బాదరాగా రాబర్ట్ వాద్ర మరియు డి.యల్.యఫ్. సంస్థకు మధ్య జరిగిన భూ ఒప్పందాలకు క్లియరెన్స్ మంజూరు చేయడాన్ని మోడీ తప్పు పడుతూ అది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడం క్రిందే వస్తుంది కనుక హుడా ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమీషన్ న్ను కోరారు. అంతే కాదు ఇదే అంశాన్ని ఆయన తన ప్రతీ సభలో ప్రధానంగా ప్రస్తావిస్తూ, సోనియాగాంధీ కుటుంబ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకొంటున్నారు. బహుశః ఈ అంశమే హర్యానాలో కాంగ్రెస్ కొంప మున్చావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.