ఓటమి వైరాగ్యం నుండి బయటపడిన కాంగ్రెస్

 

రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఓడిపోయినప్పుడు ఆత్మవిమర్శ చేసుకొని, అంతర్గత లోపాలను సవరించుకొని ముందుకు సాగుతామని చెప్పుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒక మూస ధోరణినికి అలవాటుపడిపోయిన పార్టీలు, వాటి నేతలు తమ అలవాట్లను, పద్దతులను అంత త్వరగా వదులుకోలేవని ఆ తరువాత పరిణామాలు స్పష్టం చేస్తుంటాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోయిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు కూడా ఈ ఆత్మవిమర్శ పాటనే మరోమారు కోరస్ గా ఆలపించారు. కానీ, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం రెండు రోజులే అన్నట్లుగా ఈ ఆత్మవిమర్శ బాధ నుండి వారు కూడా చాల త్వరగానే బయటపడగలిగారు.

 

వచ్చేఎన్నికలలో విజయం సాధించడం కోసం తమ పార్టీ, ప్రభుత్వం ఏవిధంగా సన్నదమవ్వాలనే దానికంటే, తమ బలమయిన రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీని ఏవిధంగా కట్టడిచేయాలనే తీవ్రంగా ఆలోచిస్తూ, ఒక మహిళా ఆర్కిటెక్ట్ కదలికలను కనిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం గూడచర్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఒక కమీషన్ వేస్తున్నట్లు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నిన్న ప్రకటించారు. గోద్రా అల్లర్లలో మోడీ పాత్రను పరిశోదించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక పరిశోదనా బృందం (సిట్) మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడం సబబేనని నిన్న అహ్మదాబాద్ లోని మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే, మరో కేసులో విచారణ అంటూ హోంమంత్రి కమీషన్ వేయడం చూస్తే, కాంగ్రెస్ ఎన్నటికీ తన తీరు మార్చుకో(లే)దని స్పష్టం అవుతోంది. ఈ తెలివితేటలేవో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకోగలిగితే కొంతయిన ప్రయోజనం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వ్యవహరిస్తోంది.