విభజనతో సీమాంద్రాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందా

 

రాష్ట్రవిభజన నిర్ణయంతో తెదేపా, వైకాపాలకు తెలంగాణాలో చెక్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు అదే నిర్ణయం వల్ల సీమాంధ్రను కోల్పోబోతోందా? ప్రస్తుతం ఆ రెండు పార్టీలు సమైక్యాంధ్ర లేదా సమన్యాయం కోసం చేస్తున్నఉద్యమాలకు కాంగ్రెస్ బలి కాబోతోందా? అది తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకే మొగ్గు ఎందుకు చూపుతోంది?

 

తెలంగాణా ఉద్యమాల ఒత్తిడి కారణంగా కేంద్రం తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయంతో రానున్న ఎన్నికలలో రెండు ప్రాంతాలలో లాభపడాలనే కాంగ్రెస్ అడియాస లేకపోలేదు. ఇక, తమను దెబ్బ తీసేందుకే రాష్ట్ర విభజన చేస్తోందని తెదేపా, వైకాపాలు చేస్తున్నఆరోపణలలో కొంత నిజం లేకపోలేదు. ఈ దెబ్బతో ఆ రెండు పార్టీలు తెలంగాణాను కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టక తప్పనిసరి పరిస్థితి కల్పించింది.

 

అందుకు ప్రతిగా ఆ రెండు పార్టీలు సీమాంధ్ర ప్రజల తరపున స్వచ్చందంగా వఖల్తా పుచ్చుకొని సమైక్యాంధ్ర లేదా సమన్యాయం అంటూ తీవ్ర పోరాటం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన చేసి సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, అదే విధంగా ఎదుట పార్టీకూడా ఈ కుట్రలో పాలుపంచుకొందని రెండు పార్టీ నేతలు గట్టిగా చెపుతూ సీమాంధ్ర ప్రాంతంపై పట్టుకోసం పోరాడుతున్నారు. ఈ రేసులో ప్రస్తుతం వైకాపా ముందు ఉందని మారుతున్న రాజకీయ పరిణామాలు చెపుతున్నాయి.

 

సమైక్యావాదం గట్టిగా వినిపిస్తున్నవైకాపాకే రానున్నఎన్నికలలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసుకొన్న అనేక మంది కాంగ్రెస్ యంయల్యేలు, మంత్రులు, చిన్నాపెద్దా నేతలు వీలయినంత త్వరగా గోడ దూకేసి వైకాపాలో పడితే ఒడ్డున పడినట్లేనని భావిస్తున్నారు. వారిలో మంత్రులు విశ్వరూప్, వట్టి వసంతకుమార్, కాసు కృష్ణా రెడ్డి, యంపీలు సాయి ప్రతాప్, యస్.పీ.వై.రెడ్డి, యంయల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అడల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, శిల్పా మోహన్ రెడ్డి, యమ్యల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి తదితరులున్నారు. మాజీ మంత్రి మోపిదేవి కుటుంబ సభ్యులు ఇప్పటికే వైకాపాలో చేరారు.

 

ఇక సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా నేడో రేపో పార్టీని వీడి సీమాంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తారని నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ నిర్ణయం వికటించిందని, తను తవ్వుకొన్న గోతిలో తనే పడిందనిపిస్తుంది.

 

అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, దైర్యంగా రాష్ట్ర విభజనకు సిద్దపడుతోంది. అంటే, సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవడానికి తగిన వ్యూహాలు, ప్రతిపక్షాలపై ప్రయోగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద మరికొన్నిఅస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని అర్ధం అవుతోంది. రాష్ట్ర విభజన చేసినప్పటికీ బలమయిన సీమాంధ్రను పోగొట్టుకొనేంత తెలివి తక్కువది కాదు కాంగ్రెస్ పార్టీ. సీమంధ్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నవిధంగా వారికి ప్యాకేజీలు ఇచ్చిబుజ్జగించడమో లేకపోతే మధ్యంతర ఎన్నికలకి గంట కొట్టి పార్టీ టికెట్స్ ప్రహసనం మొదలుపెట్టి తన నేతలని కట్టడి చేయడమో చేయవచ్చును.