ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిజంగానే పోరాడుతోందా?

 

రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ నిలద్రోక్కుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా అంగీకరించకపోయినా, ఆ కారణంగానే వారు ఇన్నాళ్ళుగా తమ కలుగులలోనుండి బయటకు రావడానికి సాహసించలేదనే విషయం అందరికీ తెలుసు. ఎన్నికలయిన ఓ ఆరు నెలల తరువాత వారి ఆగ్రహం కొచెం చల్లారి ఉండవచ్చుననే ఆలోచనతోనే బయటకు వచ్చి, ప్రజా సమస్యల మీద పోరాటాలు అంటూ ప్రజలను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ప్రత్యేక హోదా కోసం వారు చేస్తున్న ఉత్తుత్తి పోరాటాలు ప్రజలను మళ్ళీ బుట్టలో వేసుకోవడానికేననే సంగతి వారికీ తెలుసు, ప్రజలకి కూడా తెలుసు. వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉన్నా లేకపోయినా వారు చేస్తున్న ఈ పోరాటం వలన కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడిపెరిగి రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయకపోదా? అనే ఆశతో ప్రజలు కూడా వారి పోరాటానికి మద్దతు తెలుపకపోయినా అభ్యంతరం మాత్రం చెప్పడం లేదు.

 

ప్రత్యేక హోదా కోసం తాము చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి ఆశించిన మద్దతు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు చాలా నిరాశకు గురయ్యారనే చెప్పవచ్చును. తమపై ఆగ్రహంగా ఉన్న రాష్ట్ర ప్రజలను ఏవిధంగా ప్రసన్నం చేసుకొని మళ్ళీ రాష్ట్రంలో నిలద్రోక్కుకోవాలా...అని వారు మదనపడుతున్నప్పుడు, తెలంగాణా నుండి కాంగ్రెస్ పార్టీకే చెందిన నల్గొండ యంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాయడంతో, వారికి అది తమ నిజాయితీని నిరూపించుకొనేందుకు ఒక గొప్ప అవకాశంగా కనబడింది. తక్షణమే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ వ్రాయడాన్ని తప్పుపడుతూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, పార్టీ అధిష్టానంలో పెద్దలందరికీ లేఖలు వ్రాసిపడేశారు.

 

కాంగ్రెస్ అధిష్టానమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు, దాని కోసమే రాష్ట్రంలో తామంతా పోరాడుతున్నప్పుడు, దానికి స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా మద్దతు ఇస్తున్నప్పుడు, తమ పార్టీకే చెందిన ఒక యంపీ అభ్యంతరం చెప్పడం, పైగా ప్రధాన మంత్రికి లేఖ కూడా వ్రాయడాన్ని తాము అంతా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

 

కానీ రఘువీరా రెడ్డి చెపుతున్న ఈ విషయాలేవీ గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలియవనుకోలేము. అయినా ప్రధానికి లేఖ వ్రాసారంటే ఇది కూడా కాంగ్రెస్ మొదలుపెట్టిన సరికొత్త డ్రామాగానే భావించకతప్పదు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే అనేక చిక్కుముడులున్నాయి. వాటిని విప్పడానికే కేంద్రప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ఇప్పుడు గుత్తా వ్రాసిన లేఖతో బహుశః ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఒట్టొట్టి యుద్ధం మొదలుపెట్టవచ్చును. దాని వలన మరిన్ని కొత్త సమస్యలు ఏర్పడితే, ఇక ఎన్నటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవచ్చును. బహుశః కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకొంటోందేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనంతవరకే మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడగలదు. అందుకే అది ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు నటిస్తూనే మరోపక్క ఈవిధంగా ఆటంకాలు సృష్టిస్తోందేమో? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఇక కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ సరి కొత్త డ్రామా వలన మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రత్యేక హోదా గురించి తాము చేస్తున్న పోరాటం నిజమేనని రాష్ట్ర ప్రజలను నమ్మించ వచ్చును. ఏవిధంగా అంటే, ఆంద్రాలో తమ కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టుకొని మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసామని తెలంగాణా కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకోవడం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం తెలంగాణాలో తమ స్వంతపార్టీ నేతలతోనే పోరాడుతున్నామని చెప్పుకొని రాష్ట్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తారేమో?

 

కానీ ఒకవేళ వారు ఈ అంశంపై నిజంగానే యుద్ధం మొదలుపెడితే, దానిని కాంగ్రెస్ అధిష్టానం ఉపేక్షించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టిందని భావించాల్సి ఉంటుంది. కనుక రఘువీరారెడ్డి వ్రాసిన లేఖపై కాంగ్రెస్ అధిష్టానం స్పందనను బట్టి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏమిటో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే కోరిక, పట్టుదల దానికి నిజంగానే ఉన్నాయా లేవా? అనేది అంచనా వేయవచ్చును.

 

ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రఘువీరా రెడ్డి లేఖపై తక్షణమే స్పందించి, సుఖేందర్ రెడ్డితో సహా తెలంగాణాలో తన పార్టీ నేతలందరికీ ఈ అంశం మీద మాట్లాడవద్దని గట్టిగా హెచ్చరికలు చేసినట్లయితే, సుఖేందర్ రెడ్డి ప్రధానికి లేఖ వ్రాయడం వెనుక ‘కాంగ్రెస్ హస్తం’ ఏమీ లేదని నమ్మవచ్చును. కానీ ఉపేక్షిస్తే మాత్రం కాంగ్రెస్ అధిష్టానమే ఆయన చేత మోడీకి లేఖ వ్రాయించి ఈ సరికొత్త నాటకానికి తెర తీసిందని అనుమానించవలసి వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇరు రాష్ర్టాల ప్రజలతో చెలగాటమాడినందుకే రెండు రాష్ట్రాలలో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన వేలుతో తన కంటినే పొడుచుకొన్నట్లవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.