TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా ప్రేమను కోపంగానో..మా ప్రేమను ద్వేషంగానో..ఫీల్ అవర్ లవ్

Published on: Wed Jan 1, 2014 8:49PM

 

వచ్చేఎన్నికలలో అదృష్టవశాత్తు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీని ప్రధానిగా పట్టాభిషేకం చేసేసి, ఆయన ఆ కుర్చీలో కాలుమీద కాలేసుకొని టీవిగా కూర్చొంటే చూసి తరించాలని యావత్ కాంగ్రెస్ భక్త కోటి ఒకటే ఆరాటపడిపోతోంది. స్వచ్చమయిన కాంగ్రెస్ డీ.యన్.యే.గల ప్రతీ కాంగ్రెస్ వాది కూడా తమ యువరాజావారికి ప్రధాని కాగల అన్నిఅర్హతలు ఉన్నాయని ఏకగ్రీవంగా కన్ఫర్మ్ చేసేసారు కూడా.

 

కానీ, నగదు బదిలీ పధకం ద్వారా నెలనెలా పదో పాతికో రూపాయలు తీసుకొంటున్నామనే విశ్వాసం కూడా లేని చాలా మంది జనాలు మాత్రం ఆ కాంగ్రెస్ వాదుల అభిప్రాయాలతో ఏకీభవించక పోవడం చాలా విచారకరం. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడో కాదో చెప్పడానికి వారేమయినా మొయిలీ, షిండే, గులాం, దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబాల్, మనీష్ తివారీల కంటే తెలివయినవారా? అంటే అదీ కాదు. జస్ట్ ఆమాద్మీలు అంతే! అయినా కూడా మాకు ఓ బ్రెయిను, దానికో అభిప్రాయం ఉంటుందని ఒకటే విర్రవీగుతున్నారు. ఆ అహంకారంతోనే యువరాజవారు, రాజమాత స్వయంగా తరలివచ్చి జనాలకి ఎంత నచ్చజెప్పినా వినకుండా నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని చీపురుపట్టుకొని ఊడ్చిపారేసారు.

 

ఇప్పుడు ఆ పెద్దాయన మన్మమోహనులవారు వయసు మీద పడటంతో ప్రధాని కుర్చీలో నిలకడగా కూర్చోలేకపోతున్నారని జాలిపడి, ఈ కాంగ్రెస్ భక్తుల మాట కాదనలేక పోనీ ఆ కుర్చీలో కూర్చొనేందుకు యువరాజవారు దయతో అంగీకరిస్తే, అందుకు ఈ జనాలు సంతోషించకపోగా “అసలు ఆయనకేమి తెలుసని అందులో కూర్చొనేందుకు రెడీ అయిపోతున్నారు? తొమ్మిదేళ్లుగా తల్లి కొంగు చాటునే రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఏనాడయినా ఏ సమస్యనయినా పరిష్కరించారా? కనీసం మాట్లాడారా?” అంటూ అర్ధం పర్ధం ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్నారు.

 

“పోనీ ప్రభుత్వాన్ని, దేశాన్ని ఆయన ఉద్దరించలేకపోయినా కనీసం స్వంత పార్టీనయినా చక్కదిద్దుకొన్నారా? ఆయనకు పార్టీ కిరీటం పెట్టిన తరువాత నుండి ఇంత వరకు నీతి, అవినీతి, నిజాయితీ, క్రమశిక్షణ గురించి లెక్చర్లు దంచడం తప్ప వాటిలో ఒక్కటయినా అమలు చేయగలిగారా? కనీసం ఒక వ్యక్తికి జోడు పదవులు ఉండకూడదని రూల్స్ మాట్లాడిన ఆయన కనీసం దానిని కూడా నేటికీ అమలుచేయలేనప్పుడు ఇక దేశాన్ని ఎలా గాడిన పెడతాడు? అయినా ఏదో ఒకరోజు తను కూడా బామ్మలాగే ఎవరి చేతిలోనో చచ్చిపోతానని మైకు చించుకొని చెపుతున్నఆయనకీ పట్టాభిషేకం మాత్రం ఎందుకట?” అని సన్నాయి నొక్కులొకటి పైగా.

 

కళ్ళుండి కూడా చూడలేదీ పాడులోకం. ఆయన చొరవ తీసుకోబట్టే ఈ జనాలు లోక్ పాల్ బిల్లు, భూ సేకరణ బిల్లు వంటి కనీవినీ ఎరుగని అనేక బిల్లులను చూడగలిగారు. ఆయన దయతలచబట్టే ఈ జనాలకి ఈ నగదు బదిలీ పధకం, ఆహార భద్రతా పధకం, పన్నెండు సబ్సిడీ సిలిండర్లకు బదులు తొమ్మిదేసి సిలిండర్లు పొందగలుగుతున్నారు. అయినా కూడా ఈ జనాలు తమకు ఇంకా ఏదో తక్కువయిందని వాపోవడం ఓ ఫేషన్ అయిపోయింది.

 

యువరాజవారు ఇంకా ప్రధాని పదవి చెప్పట్టకుండానే ఇన్నేసి పనులు ఎడమ చేత్తో చేసి పడేస్తున్నాఅవేవీ పట్టించుకోకుండా, “దేశం, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు” అంటూ ఆ మోడీ చెప్పే తియ్యతియ్యటి మాటలనే గుడ్డిగా నమ్ముతూ, ఆయనకే ప్రదాని కుర్చీ బాగా సూట్ అవుతుందని సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారు.

 

“పదేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో దేశంలో కుంభకోణాలు తప్ప ఏమి కనబడుతున్నాయి? రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపడితే, ఆయన వల్ల దేశానికి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఆయనకి పట్టాభిషేకం జరిగితే మాకేంటి?” అని గిట్టనివారు నిలదీస్తుంటే, చంద్రబాబు వంటి చెడ్డవాళ్ళు కొందరయితే “మీరు మాపాలిట అనకొండలు” అంటూ కాంగ్రెస్ గురించి మరీ నీచంగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. “మీ యువరాజుకి పట్టాభిషేకం చేసుకోవాలంటే అందుకు మా రాష్ట్రమే దొరికిందా విడగొట్టడానికి?” అంటూ జగన్ బాబు కూడా అవేశపడిపోతున్నాడు. ఇక, తామంతా గొప్ప రామ భక్తులమని గొప్పలు చెప్పుకొనే బీజేపీ వాళ్ళకయితే మరో పనిలేనట్లు తెల్లారిలేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు ఎప్పడూ ఆ సోనియా రాహుల్ గాంధీల నిత్యనామపారయణమే తప్ప ఏనాడు ఎవరూ కూడా నోరారా “రామ” అని పలికింది లేదు.

 

ఈవిధంగా దేశంలో యావత్ ప్రజానీకం, ప్రత్యర్ధ రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా “మా ప్రేమను కోపంగానో, మా ప్రేమను ద్వేషంగానో.. ఫీల్ అవర్ లవ్” అంటూ సోనియా రాహుల్ గాంధీల గురించే పాడుకొంటున్నారు, మాట్లాడుకొంటున్నారు. ఎవరికయినా ఇంతకంటే ఏమి కావాలి? వారు కురిపిస్తున్న అపారమయిన ప్రేమ కోసం ప్రధాని మంత్రి కుర్చీ ఏమిటి.. అవసరమయితే ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేసెయోచ్చు.