కాంగ్రెస్ సిగ్నల్స్ పట్టించుకోని కేసీఆర్

 

అడగందే అమ్మయినా అన్నం పెట్టదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అడగకుండా తెలంగాణా ఎందుకు ఇస్తుంది? తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరినప్పుడు తెలంగాణా నేతలను చూస్తేనే ఉలికులికి పడిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు దోశలు, పెసరట్లు అంటూ వెటకారం చేయగలుగుతున్నారంటే అందుకు కారణం ఎన్నికల (అ)జెండాలు, (అ)విశ్వాస తీర్మానాలను వేసుకొన్న ఉద్యమపార్టీ ఊసరవెల్లిలా రంగులు మార్చుకొంటూ క్రమంగా రాజకీయ పార్టీగా మారడమే ప్రధాన కారణమా? లేక ఈ మిషతో తెలంగాణా ఉద్యమాన్నిపక్కదారి పట్టించిన తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు మాటకి ఇక తెలంగాణా ప్రజలలో విలువలేదని వారు గ్రహించడం వలనే ఈ విధంగా మాట్లాడే దైర్యం చేయగలుగుతున్నారా? లేక మరేదయినా బలమయిన కారణాలు ఉన్నాయా?

 

గులాం నబీ ఆ ‘జాదూ’, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే పెట్టిన ‘నెలరోజుల్లో తెలంగాణా విడుదల’ను అకస్మాత్తుగా ఆఖరి నిమిషంలో తెర మీద ప్రత్యక్షమయ్యి తన మంత్రం దండంతో ఆపేసిన తరువాత, చెలరేగిపోతారనుకొన్న తెరాస, తెలంగాణా జేయేసీ నేతలు కూడా తమ ఉద్యమ జెండాలు పక్కన పడేసి, ఎన్నికల జెండాలు పట్టుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖంగు తింది.

 

ఈ లోగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాపై కొత్త పల్లవి అందుకోవడమే కాకుండా, ఆ పాటతో తెలంగాణా ప్రజలను కూడా బాగానే ఆకట్టుకొన్నారు. ఆయన తెలంగాణాలో పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆయనకు తెలంగాణాలో ఉన్నవ్యతిరేఖత తెలంగాణా పల్లవి అందుకొన్నాక పూర్తిగా మారిపోయింది. తెదేపా తెలంగాణా పల్లవి అందుకోవడంతో తెలంగాణా లో అదృశ్యం అయిపోతుందన్న తెదేపా మళ్ళీ బలపడటమే కాకుండా, సహకార ఎన్నికలలో కూడా విజయం సాదించ గలిగింది. ఆయన పార్టీకి తెలంగాణాలో మద్దతు పెరగడానికి మరో కారణం తెలంగాణా ఉద్యమంపట్ల చిత్త శుద్ధిలేని తెరాస అధినేత కేసీఆరే కారణం అని చెప్పవచ్చును.

 

ఆయన తెలంగాణా ఉద్యమాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించేడో గమనించిన తెలంగాణా ప్రజలలో చంద్రబాబు పట్ల అవ్యాజమయిన ప్రేమ ఏది లేకపోయినప్పటికీ, మాట నిలకడలేని కేసీఆర్ ను నమ్ముకోవడం కంటే మంచి పరిపాలనాదక్షుడిగా పేరుతెచ్చుకొన్న చంద్రబాబును నమ్ముకోవడమే మేలనే భావన కలగడం వల్లనే ఆయనను తెలంగాణా ప్రజలు ఆదరించారు. తత్ఫలితంగా తెలంగాణా జిల్లాలలో చంద్రబాబుకు, తెలుగు దేశం పార్టీ కి అనూహ్యంగా మద్దతు పెరిగింది.

 

ఈ పరిణామాలు చూసి మొదట కంగారు పడిన తెరాస నేతలూ, వారి నాయకుడు కేసీఆర్ ‘నైవేద్యం పెడితే మా మహిమ చూపిస్తామనే గ్రామ దేవతల్లాగా,’ మా అభ్యర్ధులను గెలిపిస్తేనే తెలంగాణా సెంటిమెంటు గెలిచినట్లు, లేదంటే మనం ఓడిపోయినట్లే అని ప్రజలకు నచ్చచెప్పుకొని శాసనమండలి ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడ్డారు. కేవలం మూడు నాలుగు జిల్లలో పట్టభద్రులకి, ఉపాద్యాయులకే పరిమితమయిన శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికలతో సమానంగా భావించి వారందరూ ఎంత చెమటోడ్చినా తాము నిలబెట్టిన ముగ్గురులో ఇద్దరినీ మాత్రమే గెలిపించుకోగలిగారు. ఇదేమంత చెప్పుకోవలసిన విషయం కానప్పటికీ, అది తెలంగాణా ప్రజలలో తెరాస పట్ల పెరుగుతున్న నిరాసక్తతకు ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుంది.

 

అయినప్పటికీ, ఇంకా పూర్తిగా మేల్కోనని కేసీఆర్ ను చూసి తెరాస కార్యకర్తలే కాకుండా విపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇక, సాధారణ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు మిగిలి ఉందని అందరూ భావిస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో, దేశంలో తనకు అనుకూల వాతావరణం ఏర్పడగానే ఎన్నికలకు వెళ్లాలని ఆత్రంగా ఎదురు చూస్తోంది. దేశంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితుల సంగతి ఎలా ఉన్నపటికీ, 42మంది పార్లమెంటు సభ్యులను అందించే మన రాష్ట్రంలో, తమ పార్టీలో కలిసిపోయెందుకు సిద్ధంగా ఉన్న తెరాస, దాని అధినేత కేసీఆర్, వారి ఉద్యమాలు చప్పగా చల్లారిపోవడంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరో వైపు జగన్ మోహన్ రెడ్డి క్రమంగా బలం పుంజుకోవడం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమయింది. కానీ, అదే విషయాన్నీ నేరుగా కేసీఆర్ తో చెప్పడం అంటే కొరివితో తల గోక్కోవడమేనని తెలుసు గనుక, వాయలార్ రవి చేత ముందుగా ‘తెలంగాణా దోశలు వేయించి’ తెలంగాణా నేతలలో కొంచెం వేడి పుట్టించింది.

 

గానీ, ఆ వేడి ఏంతో కాలం నిలవకపోవడంతో మళ్ళీ ఇటీవలే హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చేత ‘తెలంగాణా ఇవ్వడం అంత వీజీ కాదు. ఇస్తే దేశంలో విదర్భ, గూర్ఖా ల్యాండ్ వంటి ప్రత్యెక రాష్ట్ర డిమాండులు మళ్ళీ మేము తలకెత్తుకోలేము. అందువల్ల తెలంగాణా గురించి డెడ్లయిన్ లు, ఆశలు పెట్టుకోవద్దు’ అని మరోమారు తెలంగాణావాదులను గిల్లి చూసారు. కానీ, తెరాస నేతలటువంటి మాటలకి, వెటకారానికి స్పందించడం ఎప్పుడో మానేశారు.

 

ప్రస్తుతం వారి దృష్టి అంతా రాబోయే ఎన్నికల మీదే ఉంది. శాసన మండలి ఎన్నికలకే చెమటోడ్చవలసివచ్చిన తెరాస వచ్చే సాధారణ ఎన్నికలలో గెలుస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఆ పేరుతొ పార్టీ టికెట్ల కేటాయింపు అనే చాల పెద్ద వ్యవహారంలో ఇప్పుడు తలమునకలయి ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్, షిండే, వాయలార్ రవి వంటి వారిచేత కాంగ్రెస్ అధిష్టానం నోరు జార్పించినా తెరాస నేతల్లో మాత్రం ఉలుకుపలుకు లేదు.

 

బహుశః అందువల్లేనేమో నిన్న ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తో పోలిస్తే తెరాస, వైకాపాలు చిన్న పార్టీలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు అని మరో మారు గిల్లి చూసారు. కానీ, ఇటువంటి మాటలకి ప్రతీసారీ తాత్కాలికంగా స్పందించడమే తప్ప కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న తెలంగాణా వేడి మాత్రం రగలడం లేదు.

 

తెలంగాణాలో మళ్ళీ కొంచెం వేడి రగిలితే, తెలంగాణాపై ఏదోఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసేసి, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెరాసను ‘కాంగ్రెస్ గంగలో కలిపేసుకొని’, తమ ‘చేతిలో చేయేసి’ నడిచేందుకు చొరవ చూపుతున్న జగన్ మోహన్ రెడ్డిని ముందు పెట్టుకొని ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లుగా ఎన్నికలకు వెళ్ళినట్లయితే, ఇక ఏ చంద్రబాబు కూడా తమను ఆపలేడని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేంద్రం నుండి కాంగ్రెస్ పంపిస్తున్న ఈ 3జీ సిగ్నల్స్ ను తెరాస అధ్యక్షుడు కేసేఆర్ మరెందుకో సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది.

 

తెలంగాణా కోసం కాంగ్రెస్ గంగలో మునగడం వల్ల, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ రాజభోగం పోగొట్టుకోవడం కంటే, ఎన్నికలలో వీలయినన్ని సీట్లు సంపాదించుకొని అందరితో చెలగాటం ఆడుకోవడమే తమకి ఎక్కువ లాభమని కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉండటం వల్లనే బహుశః కాంగ్రెస్ ప్రసారం చేస్తున్న3జీ సిగ్నల్స్ కూడా ఆయన సరిగ్గా క్యాచ్ చేయడం లేదనుకోవాలి.

 

మరిప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఏవిధంగా గిల్లుతుందోలేక కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణా లో మరొకరిని పైకి తీసుకువస్తుందో చూడాలి.