TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిఎంతో విభేదాలు లేవని కొట్టిపారేసిన బొత్స

Published on: Fri Dec 16, 2011 1:28PM

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమ  మధ్య సత్సంబంధాలే ఉన్నాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  న్యూఢిల్లీలో మీడియా  సమావేశంలో అన్నారు. తాను సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పే ఢిల్లీ వచ్చానన్నారు.ఏకాభిప్రాయం రానప్పటికీ కాంగ్రెసు పార్టీ త్వరలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి బేషరతుగా తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం తప్పకుండా ఉంటుందన్నారు.చిరంజీవి వర్గం అసంతృప్తి వెనుక తాను ఉన్నానన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు కొన్ని పార్టీలకు చెందినవిగా మన రాష్టంలో ఉన్నాయని అది దురదృష్టకరమని దానివల్లే ఇలాంటి అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయమని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పార్టీ పరంగా త్వరలో నోటీసులు పంపిస్తామన్నారు.

సంస్థాగతంగా జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. ఉప ఎన్నికలకు అభ్యర్థుల్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు వెళ్లడం బాధాకరమే అని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను పలు అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు.