శివసేనకు కాంగ్రెస్-ఎన్సీపీ ఓపెన్ ఆఫర్... శరద్ పవార్ తో సంజయ్ రౌత్ మంతనాలు

 

మహారాష్ట్ర రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి చెరిసగమంటోన్న శివసేన తన పట్టువీడకపోవడంతో... ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి కంటిన్యూ అవుతోంది. అయితే, శివసేన శాసనసభాపక్ష సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, ఎన్సీపీతో టచ్ ‌లో ఉన్నామన్న ఉద్ధవ్.... శివ సైనికుడే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రకటించారు. 50-50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోతే అసలు చర్చలకే వెళ్లబోమని ఉద్ధవ్ ఠాక్రే తేల్చిచెప్పారు. ఇక, బీజేపీ, శివసేన మధ్య జరుగుతోన్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్‌-ఎన్సీపీ... ఓపెన్ ఆఫర్ ప్రకటించాయి. శివసేనకు అన్ని దారులూ తెరిచే ఉంచామని, ప్రతిపాదనలతో వస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమని చెబుతున్నాయి.

మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105.... శివసేనకు 56... కాంగ్రెస్‌కు 44... ఎన్సీపీకి 54 సీట్లు వచ్చాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 ఏ పార్టీకి రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై పీఠముడి కొనసాగుతోంది. కానీ ఎన్నికలకు ముందే కూటమిగా పోటీచేసిన శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా.... ముఖ్యమంత్రి పదవి చెరిసగమంటూ ఉద్ధవ్ మెలిక పెట్టడంతో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇక, శివసేన తరపున వాయిస్ వినిపించే ఎంపీ సంజయ్ రౌత్... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమవడంతో... మరాఠా రాజకీయం కొత్త మలుపు తిరగొచ్చన్న ప్రచారం జరుగుతోంది.