కాంగ్రెస్ కి తలపోటు తెప్పిస్తున్న సినిమా.. బీజేపీ ఫుల్ హ్యాపీ

 

లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఒక్క సినిమా ఒకేఒక్క సినిమా కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది. అదే ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చేలా ఉంది. మన్మోహన్ సింగ్ ని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి తెరవెనుక సోనియా గాంధీ ప్రధానిగా వ్యవహరించినట్లు చూపించారు. మన్మోహన్ తను నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడలేదని.. సోనియా చెప్పినట్టు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ లో చూపించారు. ఇవన్నీ సంజయ్ బారు రాసిన పుస్తకంలో ఉన్నవే. అయితే పుస్తకం చదివినవారు తక్కువుంటారు. కానీ ఇప్పుడు ఈ సినిమా లక్షలు, కోట్ల మందికి చేరే అవకాశముంది. దీనివల్ల మన్మోహన్ కి, కాంగ్రెస్ పార్టీకి దెబ్బే. అందుకే కాంగ్రెస్ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుంది. సినిమాను విడుదలకు ముందే తమకు చూపించాలంటూ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ట్రైలర్‌ను చూస్తుంటే నిజాన్ని వక్రీకరించినట్లు అనిపిస్తోంది. దీని వల్ల మా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. అందుకే సినిమాను ముందే ప్రదర్శించాలి. అభ్యంతరకర దృశ్యాలుంటే వాటిని తొలగించాలి. లేదంటే దేశవ్యాప్తంగా విడుదలను అడ్డుకుంటాం’ అని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు బీజేపీ మాత్రం పండగ చేసుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ‘10 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఓ కుటుంబం చేతిలో దేశం ఎలా దోపిడీకి గురైందో చూపించే కథ ఇది. వారసుడు సిద్ధమయ్యేంతవరకు ఓ ప్రతినిధిలా మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని కుర్చీలో కూర్చున్నారా? ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ట్రైలర్‌ను చూడండి. జనవరి 11న సినిమా విడుదలవబోతోంది’ అని ట్వీట్ లో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల ముందు ఈ సినిమా కీలక పాత్ర పోషించేలా ఉంది. ఈ సినిమా రీలీజ్ అయితే కాంగ్రెస్ కి ఎంత మైనస్సో, బీజేపీ అంత మైలేజ్ వచ్చేలా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా వెనుక బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఈ సినిమా నుంచి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.