తెరాసకు చెక్.. కోదండరామ్ తో కాంగ్రెస్ ప్లాన్ అదేనా?

 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రముఖుల్లో కోదండరామ్ ఒకరు. ఈ తరం తెలంగాణ కోసం పోరాడిన నాయకుల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ లాంటి నేతలు ఉద్యమ సమయంలో కోదండరామ్ ను ఎంతలా పొగిడారో అందరికీ తెలిసిందే. అయితే తరువాత పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సీఎం అయ్యారు. తరువాత కోదండరామ్ పోరాట లక్ష్యం కూడా మారిపోయింది. 'మనం పోరాడి తెలంగాణ సాధించినది దీనికోసం కాదు.. కేసీఆర్ పాలన సరిగా లేదు.. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యం కాదు' అంటూ కోదండరామ్ మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. కోదండరామ్ కూడా సీట్ల సర్దుబాటు గురించి కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూ బిజీగా ఉన్నారు. ఒక వైపు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతుంటే.. మరో వైపు కోదండరామ్ తో కాంగ్రెస్ ఓ ప్లాన్ వేస్తుందట. అదేటంటే కోదండరామ్ తో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోందట. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో.. కేసీఆర్ కి వ్యతిరేకంగా కోదండరామ్ తో విమర్శలు చేయించాలని చూస్తోందట.

వేరే నేతలు ఎవరు విమర్శలు చేసినా తెరాస వెంటనే తిప్పికొడుతుంది.. విరుచుకుపడుతుంది. అదే కోదండరామ్ అయితే తెరాస మిగతా నేతల మీద విరుచుకుపడినట్టు పడలేదు. హద్దుమీరి మాటలు అనలేదు. ఒకవేళ అన్నా అది తెరాస కే మైనస్. తెలంగాణ కోసం పోరాడిన నేతగా, వివాదాలకు దూరంగా ఉండే నేతగా, సౌమ్యుడుగా  కోదండరామ్ అంటే ప్రజల్లో సదాభిప్రాయం ఉంది. మరి అలాంటి కోదండరామ్ మీద తెరాస నోరుజారితే మొదటికే మోసం వస్తుంది. మొత్తానికి తెరాసకి చెక్ పెట్టడానికి కోదండరామ్ అనే అస్త్రాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకురాబోతుంది అనమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.