కాంగ్రెస్ ఉచ్చులో ప్రతిపక్షాలు

 

కొద్ది రోజులుగా సీమాంధ్రకు చెందిన తెదేపా కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరో అడుగు ముందుకువేసి తన రాజీనామాను కూడా ఆమోదింపజేసుకొన్నారు. నిన్న లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ తెదేపా కాంగ్రెస్ పార్టీలకు చెందిన మొత్తం 12మంది యంపీలను లోక్ సభ నుండి సస్పెండ్ చేయబోగా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. కానీ, ఈ రోజు స్పీకర్ వారందరినీ సభ నుండి ఐదు రోజులపాటు సస్పెండ్ చేసారు.

 

యంపీలు సభలో గొడవ చేయడం వారిని సస్పెండ్ చేయడం షరా మామూలు విషయమే అయినప్పటికీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు సస్పెండ్ అయిన కాంగ్రెస్ యంపీలు అందరూ కూడా సోనియా గాంధీకి వీర విధేయులే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సోనియా గాంధీకి వీర విధేయులయిన ఉండవల్లి, కనుమూరి, హర్ష కుమార్, లగడపాటి వంటి కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్రపై సభను స్తంభింపజేయడం ఆశ్చర్యమనుకొంటే, సభలోనే ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వారిని వారించకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

అసలు కాంగ్రెస్ యంపీలు సమైక్యాంధ్ర కోరుతూ నిజంగానే తమ అధిష్టానానికి డ్డీ కొంటున్నారా? లేక ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యర్ధులను ఏమార్చడానికే ఆడుతున్న మహానాటకంలో భాగమా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఆహారభద్రతా బిల్లుని తమ యంపీలే స్వయంగా అడ్డుకొంటున్నపటికీ సోనియా గాంధీ వారిని వారించే ప్రయత్నం చేయకపోవడం, అదేవిధంగా కీలకమయిన బిల్లుపై సభలో చర్చ జరుగుతోందని తెలిసినప్పటికీ కాంగ్రెస్ యంపీలు సభలో రభస చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

రాష్ట్ర విభజన ప్రకటన తరువాత వైకాపా రాజీనామాలతో మొదలయిన సమైక్య ఉద్యమం చూసి కాంగ్రెస్ పార్టీ కంగుతింది. రాష్ట్ర విభజన చేసి ఒకే దెబ్బకు మూడు పిట్టలు-తెరాస, తెదేపా మరియు జగన్ పార్టీలను కొడదామని అడియాసకు పోయిన కాంగ్రెస్ అధిష్టానం ఊహించని స్థాయిలో నడుస్తున్న సమైక్య ఉద్యమాలు చూసి నివ్వెరపోయింది. అయితే కధ ఇంతవరకు వచ్చిన తరువాత వెనక్కి వెళితే మొదటికే మోసం రావడం ఖాయం. అందువల్ల తన పార్టీ యంపీలతోనే తిరుగుబాటు బావుటా ఎగురవేయించి, తెదేపా, వైకాపాలు కూడా ఆ ఉచ్చులో చిక్కుకొన్న తరువాత ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లయితే క్షేమంగా బయటపడవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.