కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యేపై దాడి.. కారు బోల్తా, గాయాలు

 

రాజకీయాలు రాను రాను హింసాత్మకంగా మారుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థి నాయకుల మీద భౌతిక దాడులకు దిగుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాయ్‌బరేలీలోని హరచంద్‌పూర్‌లో కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే అదితీ సింగ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. రాయ్‌బరేలీ పంచాయతీ అధ్యక్షుడు, బీజేపీ నేత అవదేశ్‌ సింగ్‌ విశ్వాస పరీక్షకు హాజరు అయ్యేందుకు ఆమె వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ ఘటనపై అదితీ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడి వెనుక అవదేశ్‌ సింగ్‌ సోదరుడు, రాయ్‌బరేలీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌ సింగ్‌ ఉన్నారని ఆరోపించారు. ‘రెండు కార్లలో వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారు. దాదాపు 50 మంది దాడికి ప్రయత్నించారు. వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి.. మాపై రాళ్లు రువ్వారు. మరోవైపు అవదేశ్‌ సింగ్‌ ఓ కారులో కూర్చొని ఉన్నాడు’ అని అదితీ సింగ్‌ తెలిపారు.