TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ జాతీయనేతలు రెడీ?

Published on: Sat Jul 7, 2012 2:10PM

కోరినా కోరకపోయినా వరాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ జాతీయనేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి దాకా జాతీయనాయకుల ముఖం చూడాలని కాళ్లు అరిగేలా తిరిగిన వారందరికీ గతంలో తీసుకున్న అపాయింట్‌మెంట్‌ ఆధారంగా ఫోను వచ్చేస్తోంది. జాతీయ నాయకుల అపాయింట్‌మెంట్‌ డేటు, సమయంతో సహా ఫోనులోనే చెప్పేస్తున్నారు. ప్రత్యేకించి ఈ అపాయింట్‌మెంటు అంతా ఆంథ్రులకే పరిమితం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో వచ్చిన చేదుఅనుభవం తిరిగి ఎదురవకూడదని ఎఐసిసి భావిస్తోంది. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా అంశాన్నీ, ఇతర సమస్యలనూ తేల్చేయాలని ఉత్సాహపడుతోంది.



ప్రత్యేకించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విజయానికి కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి, తెలుగుదేశంలోని కిందిస్థాయి కార్యకర్తలు కారణమని కొత్త పరిశీలన ఎఐసిసి ముందుచేరింది. దీంతో ఇది ఎంతవరకూ కరెక్టో తేల్చుకోవాలని జాతీయనేతలు ఆంధ్రులతో సమావేశానికి ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పటిష్టపరచాలంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాకాంగ్రెస్‌ క్యాడర్‌లను బలపరచాలని మంత్రివర్గ ఉపసంఘం ఎఐసిసికి విశదీకరించింది. గులాంనబీఆజాద్‌తో ఈ విషయమై ఆ సంఘాధ్యక్షుడు, మంత్రి ధర్మానప్రసాదరావు సమావేశమై తెలియజేశారు. చివరిగా సిఎం, పీసిసి చీఫ్‌లతో మాట్లాడి  ఫైనల్‌ చేసేద్దామని ఆజాద్‌ తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వానికి పార్టీ పని లభించినట్లు అయింది. అలానే ఏ సమస్య పరిష్కారం కోసం వెళ్లినా సులభంగా నేతలు సహకరిస్తున్నారు.

 


 అఖిలభారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవాలని రాష్ట్రంలోని పలు జిల్లాల నేతలు ఉత్సుకత చూపారు. కొద్దిపాటి క్యాడర్‌ ఉండి నాయకునిగా గుర్తింపు ఉంటే వారికి సోనియా అపాయింట్‌మెంట్‌ లభిస్తోందని అథికారిక సమాచారం. అలానే ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంథీ రాష్ట్రంలో పరిస్థితిపైనే దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన పాల్వాయిగోవర్థనరెడ్డికి ఫోను చేయించి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈయన తరువాత పాలడుగు వెంకట్రావుకూ అలానే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. వీరిద్దరూ వయస్సు రీత్యా ఆ సమయానికి చేరుకోలేక వదిలేశారు.

 


వారం క్రితం పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రాయలసీమ నేత ఒకరు రాహుల్‌ని కలిసి మాట్లాడి వెళ్లారు. ఎంపిలు వి.హనుమంతరావు, ఎ.కె.ఖాన్‌ కూడా రాహుల్‌ను కలిశారు. మరికొందరు తాజాగా ఫోను చేసి రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. అసలు ఎవరు కలిసినా వీరిద్దరూ కూడా రాష్ట్రపరిస్థితులతో పాటు తెలంగాణా అవసరమా? కాదా? అన్న అంశాన్ని అడిగి పరిస్థితిని గమనిస్తున్నారు. రాహుల్‌గాంధీ అయితే ఇటీవల వారంలో ఐదు రోజుల పాటు ఆంథ్రారాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.