ఒకే ఒక్క ఓటు తేడాతో మేయర్ అభ్యర్థి ఓటమి..
Published on: Wed Dec 16, 2020 12:48PM
ఎన్నిక ఏదైనా ప్రతి ఓటు చాలా కీలకం అవుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క ఓటే పోటీ చేస్తున్న అభ్యర్థి తలరాతను కూడా మార్చేస్తుంది. తాజాగా కేరళలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ కేవలం ఒక్క ఓటు తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో బుధవారంనాడు ఓటమి చవిచూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వేణుగోపాల్ పోటీచేసి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు.
తన ఓటమిపై వేణుగోపాల్ స్పందిస్తూ.. "ఇది ఖచ్చితంగా గెలవాల్సిన సీటు. అయితే ఏం జరిగిందో అర్ధం అవరంలేదు. మా పార్టీలో మాత్రం ఎలాంటి సమస్యా లేదు. ఓటింగ్ మిషన్‌తోనే అసలు సమస్య. బహుశా అదే బీజేపీ విజయానికి కూడా కారణం కావచ్చు" అని అయన అన్నారు. ఇవిఎం అంశంపై కోర్టుకు వెళ్లే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు ఏమి జరిగిందో తెలుసుకున్న తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఇది ఇలా ఉండగా కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభం కాగా తాజాగా అందుతున్న లీడ్స్ ప్రకారం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ 509 స్థానాలలో, ప్రతిపక్ష యూడీఎఫ్ 369 స్థానాలలో, ఎన్డీయే 27 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.


