తెలంగాణ కాంగ్రెస్.. ఉత్తమ్ పదవి ఊడుతుందా?

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో ప్రతిపక్షానికి పరిమితమైంది.. ఇక ఏపీలో అయితే పార్టీ పరిస్థితి దారుణం, ఇప్పుడిప్పుడే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. అందుకే తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మునుపటిలా కాంగ్రెస్ పార్టీ వెలిగేలా చేయాలని అధిష్టానం భావిస్తుంది.. దానికి తగ్గట్టే రోజురోజుకి తెలంగాణలో పార్టీ బలపడుతూ బలమైన ప్రతిపక్షంగా ఉండటమే గాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.

అధిష్టానానికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకం ఏర్పడింది.. అయితే ఇప్పుడు ఆ నమ్మకం భయంగా మారుతున్నట్టు తెలుస్తుంది.. దానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు.. ఒకవైపు కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలను కలుపుకొని పోవాలని చూస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడట్లేదు.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాల్సింది పోయి, నేను సీఎం అంటే నేను సీఎం అని చెప్తూ పోటీపడుతున్నారు.. దీనికితోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ని తొలిగించాలని కొందరు.. ఇవన్నీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి.

రీసెంట్ గా రాహుల్ జన్మదినం సందర్బంగా కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ మీద ఫిర్యాదు చేశారట.. ఉత్తమ్ పార్టీలోని మిగతా నేతలని పట్టించుకోకుండా అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అందుకే ఉత్తమ్ స్థానంలో వేరొకరిని పీసీసీ చీఫ్ గా నియమించాలని కోరారట.. ఇది విని రాహుల్ ఆలోచనలో పడ్డారట.. ఇప్పటికే ఉత్తమ్ మీద పార్టీ పదవుల నియామకాల లిస్ట్ విషయంపై ఆరోపణలు వచ్చాయి.

అందుకే ఇక రాహుల్ తెలంగాణపై దృష్టి పెట్టబోతున్నారట.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు తొలిగించాలని చూస్తున్నారట.. మరి రాహుల్ ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ పదవి నుండి తొలగిస్తారా? లేక వేరే పరిస్కారం ఏమైనా చూపుతారో చూడాలి.. ఇదిలా ఉంటే ఉత్తమ్ మాత్రం మా పార్టీలో విభేదాలు లేవు, అంతా కలిసే ఉన్నాం అంటున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.