నల్గొండ కాంగ్రెస్ లో ముదురుతున్న విభేదాలు
Published on: Tue Apr 24, 2012 10:17AM
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు నానాటికీ పెరుగు తున్నాయి. జిల్లాలో ప్రధాన నాయకులందరూ ఎవరికివారే యమునాతీరేలా వ్యవహరిస్తూ పార్టీని గాలికి వదిలేస్తున్నారు. ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు కాలుపెట్టడానికి కూడా సాహసించటం లేదు. దీనికితోడు ఈ నాయకుల మధ్య ఉన్న అపోహలు పార్టీని నిర్వీర్యం చేస్తున్నాయి. మంత్రి జానారెడ్డి తన నియోజకవర్గంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఉత్తమకుమార్ రెడ్డి తన నియోజకవర్గంతో పాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన కోదాడలో మాత్రమే పర్యటిస్తున్నారు.
సూర్యాపేటలో దామోదరరెడ్డి హవా కొనసాగుతోంది. ఆయనకు తెలియకుండా ఏ నాయకుడూ ఆయన నియోజకవర్గంలో అడుగుపెట్టే సాహసం చేయటం లేదు. ములుగోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న అభివృద్ధి నిదులను వీరు స్వాహా చేస్తున్నారనీ, వీరిద్దరూ జగన్ కు కోవర్టులుగా మారారనీ పాల్వాయి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తరువాత ఆయన తన స్వరాన్ని మరింతపెంచి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కోమటిరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివెనుక పాల్వాయి వ్యూహం ఏమిటనేది అర్థం కావటం లేదు.
అయితే అధిష్టానం వద్ద తనకున్న పలుకుబడితో తన కూతురు స్రవంతికి వచ్చే ఎన్నికలో మునుగోడు టిక్కెట్టు ఇప్పించుకునే ఆలోచనతోనే పాల్వాయి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి సోదరులు అంటున్నారు. జిల్లాలోని నకిరేకల్ శాసనసభ్యుడు పెనుమర్తి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వర్గీయుల మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలా నాయకులు పరస్పరం కలహించుకుంటూ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.


