TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రఘువీరాపై భగ్గుమన్న అనంత కాంగ్రెస్ నాయకులు

Published on: Mon Apr 23, 2012 12:23PM

రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డిపై అనంతపురం కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, అనంతపురం నుంచి సుబ్బారెడ్డి పేరును ఆయన సిఫార్సు చేస్తున్నట్లు తెలియటంతో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. ఇటీవల ఎఐసిసి పరిశీలకులు వాయలార్ రవిని కలుసుకున్న సందర్భంలో రఘువీరా ఈ రెండు పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది.

 

 

అనంతపురంలో సుబ్బారెడ్డి పేరు చెప్పటం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగించింది. సుబ్బారెడ్డి అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డికి స్వయానా సోదరుడు. తమ కుటుంబ సభ్యులు ఎవరూ వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేయరని అనంత వెంకట రామిరెడ్డి పదే పదే చెబుతున్నారు. కానీ, రఘువీరారెడ్డి అనంత కుటుంబానికి చెందిన వ్యక్తినే ఎందుకు సిఫార్సు చేయాల్సి వస్తోందని మిగిలిన ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. ఆదినుంచి పార్టీని నమ్ముకుని త్యాగాలు చేసిన వారిని వదిలేసి ఎవరికో టిక్కెట్టు ఇస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. రాయదుర్గం లో రఘువీరారెడ్డి సిఫార్సు చేస్తున్న పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తే ఆయనకు డిపాజిట్టు కూడా దక్కదని వారు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు జిల్లాకు చెందిన మరో ప్రముఖ నాయకుడు జేసి దివాకర్ రెడ్డితో కూడా రఘువీరారెడ్డికి విభేదాలున్నాయి.