రేవంత్ ‘రెడ్డి’ రాజకీయం బూమరాంగ్!
Published on: Thu May 26, 2022 3:04PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ ‘రెడ్డి’ రాజకీయం బూమరాంగ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే విభేదాలు వీడి కలిసి పని చేస్తున్నట్లుగా కనిపిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ వ్యాఖ్యలు దుమారం లేపాయి. పార్టీలో పలువురు రేవంత్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. కాంగ్రెస్ మౌలిక సూత్రాలకు రేవంత్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయంటూ విరుచుకు పడుతున్నారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ మాటలు పూర్తిగా అభ్యంతరకరమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కూడా రేవంత్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. రాష్ట్రంలో బలోపేతమౌతున్న కాంగ్రెస్ కు రేవంత్ వ్యాఖ్యలు తీరని నష్టం చేకూరుస్తాయని అభిప్రాయ పడుతున్నారు. ఆ పార్ట సీనియర్ నేత మధుయాష్కిగౌడ్ అయితే రేవంత్ రెడ్డికి ఏకంగా బహిరంగ లేఖాస్త్రం సంధించారు.
.webp)
అన్ని కులాలు, మతాల సమాహారమే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్న మధుయాష్కి గౌడ్ రేవంత్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఏర్పాటు ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవిని అధిష్టించిన రేవంత్ పార్టీకి వెన్ను పోటు పొడిచే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమేనని రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా దుయ్యబట్టారు.


