తెలంగాణలో ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీగా చేసే కుట్ర

 

ఇంటర్ ఫలితాలు అవకతవకలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సీఎంకి పాలనపై.. కనీస అవగాహన లేదన్నారు. అవినీతి మూలంగా లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబెరినాకి అర్హతే లేదు.. వాళ్లకు ఎందుకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ ఫలితాలతో ప్రభుత్వంపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారన్న ఉత్తమ్.. విద్యార్థులవి ఆత్మహత్యలా? ప్రభుత్వ హత్యలా? అని ప్రశ్నించారు. అందరు విద్యార్థులకు ఉచితంగా రీ-వాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఉత్తమ్ వెల్లడించారు.

కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో ఎమ్మెల్యేనూ కొనేస్తున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. పార్టీ అనుమతిలేకుండా సీఎల్పీ విలీనం కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆనాడు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్... ఇప్పుడు ఆ పార్టీని విలీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీగా చేసే కుట్రలో భాగంగానే సీఎల్పీ విలీన కుట్రకు తెరతీశారని ఆరోపించారు.