అందరూ టచ్చులోనే ఉన్నారుట!

 

రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా ఆంద్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి వంటి మరికొందరు ఎన్నికలు పూర్తయ్యేవరకు కనిపించారు. కానీ ఆ తరువాత వారందరూ కూడా ఏదో మంత్రం వేసినట్లు మాయమయిపోయారు. ఇంతకుముందు ఏ పత్రిక తిరగేసినా, ఏ ఛానల్ పెట్టినా ముందుగా కనబడే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బొత్తిగా కనబడకుండాపోయారు. అయితే అందుకు మాజీ కాంగ్రెస్ యంపీ సాయి ప్రతాప్ చాలా మంచి కారణమే చెప్పారు.

 

మళ్ళీ చాలా రోజుల తరువాత అజ్ఞాతం నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన “వానలు పడుతాయనే ఉద్దేశ్యంతో విత్తనాలు వేస్తే వానలు పడవు. వానలు పడవనే ఆలోచనతో విత్తనాలు వేయనప్పుడు వానలు పడుతుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కనుక మళ్ళీ పరిస్థితులు అనుకూలించే వరకు మౌనం వహించడమే అన్ని విధాల ఉత్తమం,” అని అన్నారు. ఆయన చెప్పింది నిజమేనేమో! అందుకే హేమాహేమీలనదగ్గ కాంగ్రెస్ నేతలందరూ మౌనంగా ఉండిపోతున్నారేమో?

 

సాయి ప్రతాప్ చాలా రోజుల తరువాత నోరు విప్పినప్పటికీ కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కూడా చెప్పారు. వాటిలో అన్నటికంటే ముఖ్యమయినది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరకపోవచ్చుననేది ప్రదానమయినది. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని ఆయన జోస్యం చెప్పారు. ఆయనే కాదు మిగిలిన కాంగ్రెస్ నేతలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని వారిలో చాలా మంది పార్టీతో పూర్తి ‘టచ్చు’ లోనే ఉన్నారనే మరో విషయం కూడా ఆయన బయటపెట్టారు. బహుశః అందుకేనేమో మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని మీడియాలో ఎంతగా ప్రచారం అయినప్పటికీ ఒక్క నేత కూడా జేరలేదు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఈ ఒకటి రెండు నెలలలో కొంతమంది సీనియర్ కాంగ్రెస్, వైకాపా నేతలు బీజేపీలో చేరుతారని చెపుతున్నారు.

 

ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు మళ్ళినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మరిక కోలుకోలేకపోవచ్చును. ఒకవేళ వారందరూ మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొన్నట్లయితే, రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ మరింతగా శ్రమించవలసివస్తుంది. త్వరలోనే ఎవరు ఏ పార్టీలో చేరుతారో తేలిపోతే దానిని బట్టి పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చును.