కాంగ్రెస్ నేతల చిలుక పలుకులు

 

రాష్ట్ర విభజన జరుగబోతోందని తెలిసినా డిల్లీలో సమావేశాలు పెట్టుకొంటూ విభజన జరిగేంత వరకు కాలక్షేపం చేసి, ఇప్పడు పార్టీ మమ్మల్ని మోసం చేసిందని సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వచ్చి మోసలి కన్నీరు కారుస్తున్నారు,  తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తమని మోసం చేసిందని చెపుతూనే మరో వైపు ప్రతిపక్షాలని నిందించడం విశేషం. ఇంత జరిగినా తాము మాత్రం నూటికి నూరు శాతం సమైక్యవాదులమేనని ప్రజలని ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మొగుడ్ని కొట్టి వీదికెక్కినట్లు, రాష్ట్ర విభజన జరిగేందుకు అధిష్టానానికి పూర్తి సహకారం అందించి, ఇప్పుడు టీవీ చాన్నాళ్ళ ముందు గద్గద స్వరంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి  విచారం చూసి ప్రజలకు వారిపై జాలి కలుగకపోగా మరింత ఏహ్యత కలుగుతోంది.

 

లగడపాటి: మా కాంగ్రెస్ పార్టీ ప్రజల్నేకాక మమల్ని కూడా మోసం చేసింది. ఎవరి కోసమో మమ్మల్ని, ప్రజల్నిబలి చేస్తోంది. అందుకే పదవికి రాజీనామా చేసేసాను.

 

కిరణ్ కుమార్ రెడ్డి: ఆత్మగౌరవం దెబ్బతిన్నాక ఇంకా డిల్లీతో పనేముంది. ఎవరికోసమో మమ్మల్ని విస్మరించి, మేము పార్టీని విస్మరించేలా చేస్తోంది.

 

ఉండవల్లి: కాంగ్రెస్ పార్టీ మా అభిప్రాయాలను కానీ ప్రజల మనోభావాలను గానీ పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేసేసాను.

 

బొత్స: రాష్ట్ర విభజన నాకూ చాలా బాధగానే ఉంది. దీనికంతటికీ కారణం తెదేపా, వైకాపాలే. వారు మొదటే రాష్ట్ర విభజనకు అంగీకరించమని స్పష్టంగా చెప్పి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ రెండు పార్టీలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నాయి. కానీ మేము అలా కాదు. టీ-కాంగ్రెస్ నేతలు తెలంగాణా కావాలని డిమాండ్ చేస్తూంటే, సీమంద్రా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెపుతూనే ఉన్నాము. కానీ ఏమి చేస్తాం? హైకమాండ్ నిర్ణయం అలా ఉంది మరి! ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపమని కూడా అడిగాము. కానీ మరెందుకో రాలేదు. అయినా ఇక్కడి ప్రజల సమస్యల గురించి మా హైకమాండ్ కి వివరిస్తాను. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కూడా చెపుతాను. సమస్యలు వచ్చినప్పుడు పార్టీని వీడిపోవడం సబబు కాదు.

 

ప్రజలు: చేయవలసినంతా చేసి ఇంకా ఈ మొసలి కన్నీళ్లు కార్చడం ఎందుకు? ఇంకా మమ్మల్ని మభ్యపెట్టడమెందుకు?