TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ నిర్ణయం టీఆర్ఎస్ కు చెంపపెట్టులాంటిది

Published on: Fri Jun 14, 2019 11:35AM

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తుందని అన్నారు. ఓవైపు బంగారు తెలంగాణ పేరుతో దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన తీరుపై చివరకు కోర్టు కూడా నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోందని ఆమె విమర్శించారు.
 
మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీకి చెందిన సీఎం వైఎస్ జగన్ స్పీకర్‌ను ఎన్నుకొని ఆయన పదవిలో కూర్చున్న వెంటనే అధికారపక్షం తరఫున కీలకమైన ఒక తీర్మానం చేయడం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని పోస్ట్ లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రసక్తే లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని ఏపీకి చెందిన అధికార వైసీపీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో అధికారపక్షం చేస్తున్న అరాచకాలకు చెంపపెట్టులాంటిదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తనను చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాఠాలు నేర్చుకోవాలని డైలాగులు చెప్పి, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగిన కేసీఆర్ గారు ఏపీలో జరిగే పరిణామాల మీద ఏ రకంగా స్పందిస్తారని తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారని విజయశాంతి పోస్ట్ పెట్టారు.