దొరగారు అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది అంటూ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

"శిశుపాలుడి తప్పుల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజాతీర్పు తనకే అనుకూలమని విర్రవీగుతున్న దొరగారికి... ప్రజల తిరస్కారం, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్ల పడ్డాయని తాజా పరిణామాలతో అర్థమవుతోంది." అని విజయశాంతి అన్నారు.

"ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలిస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్ గారు... కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది." అని ఎద్దేవా చేశారు.

"కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని  ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కేసీఆర్ గారు శాపనార్థాలు పెట్టారు." అని మండిపడ్డారు. 

"కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ ఇసై గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకున్నారు. గవర్నర్ చొరవను కూడా సీఎం దొరగారు అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంగా కేసీఆర్ గారు తన బాధ్యతల నిర్వహణలో విఫలమైనందు వల్ల గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు." అని వ్యాఖ్యానించారు.

"గవర్నర్ చొరవను సీఎం కేసీఆర్ గారు అనవసర రాద్ధాంతం చేయడం కంటే, ప్రజలకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం మేలు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదు." అని విజయశాంతి పేర్కొన్నారు.