ఎగ్జిట్‌ పోల్స్‌.. 5.33 లక్షల కోట్ల కుంభకోణం

 

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ పై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా మోదీ-షాల మైండ్ గేమ్ గా భావిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 25వ వర్థంతి సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో రాజీవ్‌ చిత్రపటానికి పూలమాల వేసి తులసిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆర్థిక సాయం చేసిన కార్పోరేట్‌ సంస్థల షేర్లు పెంచేందుకేనని అన్నారు. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ 5.33 లక్షల కోట్ల కుంభకోణమని ఆరోపించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాక్ట్‌ పోల్స్‌ కాదని అందరికీ తెలుసునని.. ఈసారి ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితంగా మానిప్యులేటెడ్‌ ఎగ్జిట్‌ పోల్సేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ ఓ నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశానికి ప్రాణంలాంటి ఎన్నికల్లో వీవీప్యాట్లు లెక్కిస్తే తప్పేంటని తులసిరెడ్డి ప్రశ్నించారు.