మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ సీఎం కుర్చీ కదలనుంది.. అంతా బీజేపీ ప్లానేనా?

 

మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి.. 15ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి అధికారం చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాదిత్య సింధియా కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపొందిన తర్వాత సీఎం ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. సీఎం రేసులో సింధియా, కమల్‌నాథ్‌ చివరి వరకూ పోటీపడ్డారు. ఎన్నో చర్చల అనంతరం సీనియర్‌ అయిన కమల్‌నాథ్‌ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపి సీఎం బాధ్యతలు అప్పగించింది. దీంతో సింధియా పార్టీపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సింధియా.. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సోమవారం సింధియా భోపాల్‌కు వచ్చారు. అక్కడ తన సన్నిహితులను కలిసిన అనంతరం నిన్న రాత్రి మాజీ సీఎం చౌహన్‌ నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం సింధియా, చౌహన్‌ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆ తర్వాత చౌహన్‌.. సింధియాతో పాటు కారు వరకు వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు.

దీంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కాయి. చౌహాన్‌, సింధియా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది.  తాము మర్యాదపూర్వకంగానే కలిశామని చౌహన్‌, సింధియా చెప్పినప్పటికీ రాజకీయ నేపథ్యం ఉండి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం కమల్‌నాథ్‌ రాష్ట్రంలో లేని సమయంలో సింధియా.. చౌహన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ నాయకత్వం తనను పక్కన పెట్టడంతో సింధియా అసంతృప్తితో ఉన్నారనే విషయం ఈ భేటీతో స్పష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వీరి భేటీపై కాంగ్రెస్‌ స్పందించింది. అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహన్‌ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిసినట్లు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనక్‌ అగర్వాల్‌ తెలిపారు. మరి సింధియా, చౌహన్‌ ల భేటీ మర్యాదపూర్వక భేటీనేనా? లేక బీజేపీ సింధియాతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్లాన్ ఏదైనా వేసిందా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.