సినిమాలో అక్రమ ఇన్వెస్ట్ మెంట్.. ఎమ్మెల్సీ కవితపై ఈడీకి ఫిర్యాదు
Published on: Tue Sep 6, 2022 4:24PM
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తాజాగా ఒక సినిమా లో అక్రమంగా పెట్టుబడులు పెట్టారన్న ఫిర్యాదు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందింది. ఒక కాంగ్రెస్ నేత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం.
కవితపై ఒక కాంగ్రెస్ నాయకుడు నేరుగా ఈడీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా హీట్ పెంచింది. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఈడీకి మరో ఫిర్యాదు అందడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే విడుదలై డిజాస్టర్ గా నిలిచిన లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమంగా పెట్టుబడులు పెట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఈడీకి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకే కవిత, దేవరకొండ విజయ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమాలో భారీగా ఇన్వెస్ట్ చేశారని కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు.
.webp)
సినిమాలో కవిత అక్రమ పెట్టుబడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయనా ఫిర్యాదులో కోరారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించి తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్న విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్న జడ్సన్.. కవిత అక్రమ పెట్టుబడులపై, అలాగే ఇతర ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు.


