పాలన అంటే కాంగ్రెస్ పాలనే!

 

సోదర సోదరీ మణుల్లారా!

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఓసారి మా ప్రభుత్వం ఉన్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి చూడండి. అక్కడ ఉగ్రవాదులు దాడులు ఉంటాయి గానీ, మత ఘర్షణలు పెద్దగా ఉండవు. నిరంతర ఉద్యమాలు ఉంటాయి గానీ ఈవిధంగా రోడ్ల మీద ప్రజలు ఒకరినొకరు కత్తులతో పోడుచుకోవడాలు ఉండవు. ఉగ్రవాదులు అప్పుడప్పుడు బాంబులు పేల్చినప్పుడు ప్రజలు చనిపోవచ్చు. ఉద్యమాలలొ యువకులు బలి దానాలు చేసుకొని ఉండవచ్చు, అప్పుల బాధలు భరించలే రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండవచ్చును. గానీ ఇలా అనాగరికంగా ప్రజలు ఒకరినొకరు పొడుచుకొని చావరు. అందుకే మీరందరూ మా పార్టీకే ఓటేసి గెలిపించమని కోరుతున్నాము.

 

అసలు ఈ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమనేది అసలుందా లేదా? ఉండి కూడా పనిచేయకపోతే అది మా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పోటీగా వస్తోందని మేము భావించవలసి ఉంటుంది. మీ దగ్గర ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ పనిచేయదు. కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా కనబడదు. పని చేయదు కూడా. ఎందుకంటే అది ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటుంది గనుక.

 

అక్కడ మంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, ఉద్యోగులు ఒకరేమిటి అందరూ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసుకొంటూ కలిసిమెలిసి తిరుగుతారు. ఇక్కడ లాగ పదేసి కార్ల కాన్వాయ్ వేసుకొని హడావుడిగా తిరిగే మంత్రులు అక్కడ కనబడరు మీకు. అందువల్ల అక్కడి ప్రజలు ప్రభుత్వం కోసం ప్రత్యేకంగా పనిగట్టుకొని ఏదో కార్యాలయానికి వెళ్ళనవసరం లేదు.

 

బహుశః ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ భూ ప్రపంచంలో మరెక్కడా కనబడదేమో కూడా. మీకు అలాంటి ప్రభుత్వం కావాలని కోరికగా ఉందా? అయితే ఈ సారి ఎన్నికలలో మా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పితే కాంగ్రెస్ పాలనలో ఉన్నమజా ఏమిటో మీకు రుచి చూపిస్తాము. మా గొప్పదనం గురించి మేము చెప్పుకోవడం కాదు. ఏదయినా టీవీ చానల్ పెట్టుకొని చూడండి. అక్కడ మా పాలన ఎంత దివ్యంగా సాగుతోందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.

 

మా పాలనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నపటికీ, ప్రజలలో మంచి రాజకీయ చైతన్యం తేగలిగాము. అందుకే అక్కడ నిరంతరంగా ఎక్కడో అక్కడ ఉద్యమాలు జరుగుతుంటాయి. అందుకు మా నాయకులే ప్రాంతాల వారిగా విడిపోయి అక్కడి ప్రజలకు పూర్తిగా సహకరిస్తుంటారు.

 

మరి మీ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కనీసం ఒక్కసారయినా ఉద్యమం జరిగిన దాఖలాలు ఉన్నాయా? అని అడుగుతున్నాము. లేదు! అంటే ఇక్కడ ప్రజలకి స్వేచ్చ లేదు. ఇక్కడి నేతలకి ప్రజలతో కలిసి పనిచేసే అలవాటు అంత కంటే లేదని అర్ధం అవుతోంది కదా?

 

అభివృద్ధి ఎవరయినా చేయగలరు. కానీ ప్రజలని ఇంతగా చైతన్య పరచడం ఎవరికయినా సాధ్యమేనా? అని అడుగుతున్నాము. అందుకే ఈసారి మా పార్టీకే ఓటేసి మా పరిపాలనలో దొరికే పూర్తి స్వేచ్చా,స్వాతంత్రాలను పొంది ఆనందంగా జీవించమని సవినయంగా కోరుతున్నాము.

 

ఒకసారి మీరు మా పార్టీకి ఓటేస్తే ఇక మీ జీవితాలే మారిపోతాయి. ఇక మీరు ఉద్యోగాలే కాదు అసలు  ఏ పనీ కూడా చేయనవసరం లేదు . ఎందుకంటే మేము ప్రవేశపెట్టిన నగదు బదిలీ పధకం ద్వారా ప్రతీ నెల టంచనుగా డబ్బు మీ ఖాతాలో పడిపోతుంటుంది. ఆ డబ్బుతో మేము ప్రవేశపెట్టిన ఆహార భద్రతా పదకంలో కావలసినంత సరుకులు తెచ్చుకోవచ్చును.

 

ఇక మీకు ఇళ్ళు, పొలాలు గట్రా ఏమయినా ఉంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతులే. అందుకోసం ఇటీవలే మా ప్రభుత్వం భూ సేకరణ చట్టం తీసుకు వచ్చింది. అంటే మేము మీ ఇళ్ళను, పొలాలను తీసుకొని బోలెడంత డబ్బు ఇస్తామన్న మాట. దానితో హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చును.

 

అలాగని ఇల్లు పోయిందని మీరు బాధపడితే మేము చూడలేము. అందుకే మీ అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు వంటి పధకాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టాము. ఈ పధకం క్రింద ఒక్కొకరికీ అరవై గజాల విశాలమయిన స్థలాలు ఇస్తాము. అందులో మరీ అంబానీ ఇల్లు వంటిది కాకపోయినా పేద్ద ఇల్లు కట్టుకోవచ్చును. దానికి కూడా మేమే డబ్బిస్తాము. ఇంతకంటే ఎవరికయినా ఇంకేమి కావాలి చెప్పండి. 

 

గనుక ఇక మీరు చేయవలసిందల్లా మాకు ఓటేసి హాయిగా ఉద్యమాలు చేసుకోవడమే!మా ప్రియమయిన సోదర సోదరీ మణుల్లారా... ఇప్పుడు ఈ అవకాశం తప్పిపోతే మళ్ళీ ఐదేళ్ళవరకు మా పాలన పొందే యోగ్యత మీకు దక్కదు. ఆనక మిమల్ని మీరు ఎంత తిట్టుకొన్నా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంటి ప్రజా ప్రభుత్వం మీకు కూడా కావాలనుకొంటే ఈ సారి పొరపాటున కూడా ఎన్నికలలో మాకు ‘రిజక్ట్ బట్టన్’ నొక్కేయకుండా ఓటేసి గెలిపించుకోండి.

(ఇటీవల ఒక యువ కాంగ్రెస్ నేత యుపీలో చేసిన ప్రసంగం స్పూర్తితో)