బండ్ల గణేష్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.!!

 

బండ్ల గణేష్ పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ నుండి ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్.. తను చేసిన సినిమాలతో కంటే సినిమా వేడుకల్లో తను ఇచ్చే స్పీచ్ లతోనే ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరయ్యారు. ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న బండ్ల గణేష్.. రీసెంట్ గా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన వెంటనే.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలిచి అసెంబ్లీకి వెళ్లడం ఖాయమంటూ బండ్ల ధీమా వ్యక్తం చేసారు. అసలే కాంగ్రెస్ లో నేతలు ఎక్కువ.. దానికితోడు మహాకూటమి పుణ్యమా అని సీట్లు కొన్ని సర్దుబాటు చేయాలి. మరి ఇలాంటి సమయంలో బండ్లకు టికెట్ దక్కడం కష్టమే అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కొందరు మాత్రం టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే బండ్ల కాంగ్రెస్‌లో చేరారని.. కాంగ్రెస్ లోని కీలక నేతలతో బండ్లకు ఉన్న సత్సంబంధాల వల్ల టికెట్‌ ఖాయమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, బండ్ల తాను పుట్టి పెరిగిన షాద్ నగర్ టికెట్ ఆశించినట్లు ప్రచారం జరిగింది. తనకు స్థానికంగా ఉన్న వ్యాపార సంబంధాలు, సర్కిల్ తనకు ఓట్లను రాల్చుతుందని బండ్ల భావించినట్లు తెలిసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఫైనల్ చేసిన జాబితాలో షాద్ నగర్ స్థానాన్ని ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతాప్‌రెడ్డి 2009లో షాద్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. ప్రతాప్ రెడ్డి షాద్ నగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ వై.అంజయ్య యాదవ్‌నే అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రతాప్ రెడ్డి మాత్రమే ధీటైన అభ్యర్థిగా కాంగ్రెస్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షాద్ నగర్ నుంచి బండ్లకు అవకాశం లేదని తేలిపోవడంతో ఇప్పుడు ఆయన ఎక్కడ నుంచి పోటీకి దిగుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. మరి కాంగ్రెస్ బండ్లకు టికెట్ కేటాయిస్తుందో లేక షాక్ ఇస్తుందో చూడాలి.