ఎన్నికల సమరం ప్రారంభం

తెలంగాణలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఇందుకు సంకేతంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకే రోజు సమర శంఖం పూరించాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అది జరిగిన కొద్ది గంటలకే తెలంగాణ రాఫ్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ప్రణాళికను కూడా వెల్లడించారు.  అంతే కాదు... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే గడువుకు ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే అవి ముందస్తు ఎన్నికలు కావని కొత్త సూత్రీకరణలకు కూడా తెర తీసారు.

 

 

అంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆయన ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ని.మయ్యేలా ఉన్నాయి. అంతే కాదు... ఈ సెప్టెంబర్ నెలలోనే తమ అభ్యర్ధులను సైతం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని, తిరిగి మళ్లీ తమదే అధికారమనే ధీమాను సైతం వ్యక్తం చేశారు.  ఈ ప్రకటనను ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా... లేక అతి విశ్వాసంగా చూడాలో పరిశీలకులు లెక్కలు తీస్తున్నారు. ఆత్మ విశ్వాసంగా పరిగణించాలంటే కె.చంద్రశేఖర రావు గడచిన నాలుగేళ్లుగా చేపట్టిన పలు పథకాల అమలును బేరీజు వేయాలి. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైతులకు ఇచ్చిన పెట్టుబడి పథకం, మహిళలకు ప్రకటించిన కెసీఆర్ కిట్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఆయన్ని తిరిగి అధికారంలో కూర్చోపెడతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అలాగే మిషన్ భగీరథ, చెరువులు పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత వంటివి కూడా కలిసొచ్చే అంశాలుగానే వారు చూస్తున్నారు. అయితే ఇవన్నీ పైకి కనిపించే పథకాలే అయినా... వాటి వెనుక దాగి ఉన్న అవినీతి ప్రతిపక్షాలకు ఈ సారి ఎన్నికల ఆయుదం కానుంది.

 

 

ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు తొలి సారి వచ్చారు. ఇక నుంచి ప్రతి నెలా ఇక్కడకు వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. హైదరాబాద్‌లో తన తొలి పర్యటన ప్రారంభించిన రాహుల్ గాంధీకి ఇక్కడ మంచి స్వాగతమే లభించిందని చెప్పాలి. ఈమధ్య ఆయన తన ప్రసంగాలలోనూ, లోక్‌సభలోనూ రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. కన్నుకొట్టడం వంటి చిలిపి పనులను మినహాయిస్తే ఏడాది క్రితం రాహుల్ గాంధీకీ... ఈనాటి రాహుల్ గాంధీకి మధ్య తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ప్రధానమంత్రిని లోక్‌సభలో తన ప్రసంగం అనంతరం కౌగలించుకున్న రాహుల్ గాంధీ జాతీయ స్ధాయిలో అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో కూడా ఆయన చేసిన ప్రసంగం ఇక్కడి ఏలికలకు కాసింత ఇబ్బందుల పాలు చేసిందనే చెప్పాలి. అందుకే హడావుడిగా... అది కూడా రాహుల్ గాంధీ వచ్చిన రోజే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అధికార పార్టీలో ఆందోళనను తెలియజేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర సెటిలర్లదే. వీరి మద్దతు ఎవరికి ఉంటుందో వారే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సెటిలర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు.

 

 

సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కాసింత ముందుగానే స్పందించింది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆయుధాన్ని తెలంగాణలో సెటిల్ అయిన వారిపై ప్రయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి సెటిలర్ల ఓట్లను అడిగే నైతిక హక్కును కోల్పోయింది. ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ కూడా టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారంటే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అని ప్రకటనలు  చేశారు. దీంతో సెటిలర్ల ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు దిద్దుబాటు చర్యలకూ ఉపక్రమించారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న వారందరూ తెలంగాణ వాసులే అని ప్రకటించారు. అయితే, సెటిలర్లు ఆయన మాటలను నమ్ముతారో... లేక తమ బంధువులు, స్నేహితులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్‌ పార్టీకి విశ్వసిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఆరు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుందని మాత్రం తేటతెల్లం అయ్యింది.